కాంగ్రెస్‌ విషయంలో విభేదాలేమీ లేవు

20 Apr, 2018 00:32 IST|Sakshi

బీజేపీని ఎలా గద్దె దింపాలన్నదానిపైనే భిన్నాభిప్రాయాలు: ఏచూరి

వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు బలపడాలి..

అందుకు తొలుత సీపీఎం బలోపేతం కావాలి

రాజకీయ తీర్మానంపై ఏం జరుగుతుందన్నది నేడు తేలుతుంది

ప్రతినిధుల అభిప్రాయాల మేరకు తుది నిర్ణయం

తన విషయంగా ఊహాగానాలు వద్దని వ్యాఖ్య

విభజన హామీల అమలు, హోదాలపై తీర్మానాలు చేస్తామని వెల్లడి  

సాక్షి, హైదరాబాద్‌ :  కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహన, ఎన్నికల పొత్తుల విషయంలో తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. తాము 1996లో యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికైనా, 2004లో యూపీఏ ప్రభుత్వానికైనా బయటి నుంచే మద్దతిచ్చామని.. పొత్తుల కోసం ఫ్రంట్‌లలో చేరే చరిత్ర తమది కాదని పేర్కొన్నారు. పార్టీ జాతీయ మహాసభల సందర్భంగా గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు.

భవిష్యత్తులో సీపీఎం అనుసరించాల్సిన రాజకీయ విధానాన్ని నిర్ణయించుకునేందుకు మహాసభల్లో చర్చలు జరుపుతున్నామని చెప్పారు. రాజకీయ విధానం విషయంలో తాము చాలా స్పష్టంగా ఉన్నామని, దేశంలో రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయగలిగేది వామపక్షాలేనని, ఆ క్రమంలో వామపక్ష, ప్రజాస్వామ్య శక్తుల ఐక్యత అనివార్యమన్నారు. అది జరగాలంటే పెద్ద వామపక్ష పార్టీగా సీపీఎం బలపడాల్సి ఉంటుందని, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

బీజేపీ విషయంగా మాత్రమే..
బీజేపీని ఎలా గద్దె దింపాలన్న అంశంలో మాత్రం పార్టీలో భేదాభిప్రాయాలు వచ్చాయని ఏచూరి పేర్కొన్నారు. అందువల్లే ప్రకాశ్‌ కారత్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై తాను మైనార్టీ అభిప్రాయాన్ని సభ ముందు ఉంచానని చెప్పారు.

రాజకీయ తీర్మానంతో పాటు మైనార్టీ అభిప్రాయంపై కూడా మహాసభ ప్రతినిధులు చర్చించాక.. అందరి సూచనల మేరకు సవరణలు చేసుకుని తుది తీర్మానాన్ని ఆమోదించుకుంటామని తెలిపారు. అయితే మైనార్టీ అభిప్రాయాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. రాజకీయ తీర్మానం ఆమోదంపై ఓటింగ్‌ జరుగుతుందా.. లేదా అన్నది తాను ఇప్పుడే చెప్పలేనని పేర్కొన్నారు. ఓటింగ్‌ జరగాల్సి వస్తే జరుగుతుందని.. అయితే ఇప్పటివరకు పార్టీలో రహస్య ఓటింగ్‌ జరగలేదని చెప్పారు.

ఊహాగానాలు వద్దు..
‘మీ ప్రతిపాదన వీగిపోతే పార్టీ చీలిపోతుందా.. ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేస్తారా..’అని మీడియా ప్రశ్నించగా... ఊహాగా నాలు చేయవద్దంటూ ఏచూరి సమాధానాన్ని దాటవేశారు. పార్టీలో ప్రతి సభ్యుడికి సవరణలు ప్రతిపాదించే హక్కు ఉంటుందని, మహాసభలో పాల్గొన్న ప్రతినిధులెవరైనా తన ప్రతిపాదనపై ఓటింగ్‌ జరపాలని కోరే అవకాశముందని వెల్లడించారు.

రాజకీయ తీర్మానాన్ని ప్రధాన కార్యదర్శి మాత్రమే ప్రవేశపెట్టాలన్న నిబంధన తమ పార్టీలో లేదని.. గతంలో బి.టి.రణదివే, హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌లు కూడా ప్రధాన కార్యదర్శులు కాకుండానే రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే ప్రధాన కార్యదర్శి హోదాలో మైనార్టీ అభిప్రాయాన్ని ప్రవేశపెట్టవచ్చా అని ప్రశ్నించగా... జ్యోతిబసు ప్రధాని అభ్యర్థిత్వం విషయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే, మహాసభ మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేసిందని గుర్తు చేశారు.

రాజకీయ తీర్మానం అనంతరం కార్యదర్శి నివేదిక ప్రవేశపెడతామని, తర్వాత సెంట్రల్‌ కమిషన్‌ నివేదిక ఉంటుందని చెప్పారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బి.వెంకట్, రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సాగర్, ఎస్‌.రమ తదితరులు పాల్గొన్నారు.


చాలా ఫ్రంట్‌లు వస్తాయి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌లో సీపీఎం చేరే అవకాశంపై విలేకరులు ప్రశ్నించగా.. అలాంటి ఫ్రంట్‌ల చర్చలు చాలా వస్తాయని ఏచూరి వ్యాఖ్యానించారు. మూసీ నదిలో చాలా నీళ్లు వచ్చినట్టు ఎన్నికలు వచ్చే నాటికి చాలా ఫ్రంట్‌లు వస్తాయని వ్యాఖ్యానించారు.

విభజన, హోదాలపై తీర్మానాలు చేస్తాం
ఉమ్మడి రాష్ట్ర విభజన హామీలు, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై మహాసభల్లో తీర్మానం చేస్తామని ఏచూరి చెప్పారు. హోంవర్క్‌ చేయకుండా హామీలిస్తున్నారని ప్రత్యేక హోదా ప్రకటించినప్పుడే తాను రాజ్యసభలో స్పష్టం చేశానని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కచ్చితంగా ఇచ్చి తీరుతామని అప్పుడు వెంకయ్యనాయుడు చెప్పారని గుర్తుచేశారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా అమలు చేయడం లేదని విమర్శించారు.

మరిన్ని వార్తలు