కమ్యూనిస్ట్‌ (కలం) యోధుడు

9 Mar, 2019 14:44 IST|Sakshi

సాక్షి వెబ్ ప్రత్యేకం : సీతారాం ఏచూరి... కమ్యూనిస్టు యోధుడు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) జాతీయ ప్రధాన కార్యదర్శి. పేరుకు సీతారాముడైనా మతతత్వంపై పరశురాముడిలా విరుచుకుపడుతుంటారు. బెంగాలీ, మలయాళం, తమిళం, పంజాబీ, ఉర్దూ, హిందీ, ఆంగ్లాలను అనర్గళంగా మాట్లాడే పదహారణాల తెలుగువాడు. పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో గుర్తింపు పొందారు. కమ్యూనిస్టు అయినప్పటికీ తన ప్రసంగాల్లో భగవద్గీత, ఉపనిషత్తులు ప్రస్తావిస్తూ ఉంటారు. 

విద్యార్థి నాయకుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి సీపీఎం ప్రధాన కార్యదర్శి స్థాయికి చేరుకున్న నాయకుడు సీతారం ఏచూరి. ప్రస్తుతం సీపీఎం పార్టీ దేశంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండటం, త్రిపురలోనూ అధికారాన్ని కోల్పోయిన నేపథ్యంలో ఏచూరికి ఈ పదవీ బాధ్యతలు పెద్ద సవాల్‌గానే ఉన్నాయి. అంతేకాకుండా.. కరత్‌, ఏచూరి మధ్య ఏర్పడిన భేదాభ్రిపాయాలు ఇటీవల తీవ్ర స్థాయికి చేరుకున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయాల్లో విద్యావంతుడైన ఏచూరి పార్టీని ఏ విధంగా బలోపేతం చేస్తారో వేచిచూడాల్సిందే..

డాక్టరేట్‌ పూర్తి చేయలేక
1952 లో మద్రాసులో స్థిరపడిన తెలుగు కుటుంబంలో జన్మించారు. తండ్రి సర్వేశ్వర సోమయాజి, తల్లి ఏచూరి కల్పకం. సోమయాజీ ఆర్టీసీలో డివిజినల్‌ మేనేజర్‌గా పని చేసేవారు. సీతారం ఏచూరి విద్యాభ్యాసమంతా ఢిల్లీలోనే సాగింది. ఢిల్లీ ఎస్టేట్‌ స్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. సీబీఎస్‌ఈ పరీక్షలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్‌ స్టీఫెన్‌ కళాశాలలో బీఏ (ఆనర్స్‌‌) ఆర్థికశాస్త్రం, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఆర్థికశాస్త్రంలో పట్టా పొందారు. డిగ్రీ, పీజీ రెండింటిలోనూ ప్రథమ శ్రేణిలోనే ఉత్తీర్ణులయ్యారు. 1975 లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టయ్యారు. ఫలితంగా జేఎన్‌యూలో పీహెచ్‌డీలో చేరినా, డాక్టరేటు పూర్తి చేయలేకపోయారు. సీమా చిస్తీని అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. గతంలో ఆమె బీబీసీ హిందీకి ఢిల్లీ ఎడిటర్‌గా పనిచేశారు. వీరికి ముగ్గురు సంతానం.

విద్యార్థి లీడర్‌ నుంచి సీపీఎం ప్రధాన కార్యదర్శిగా
1974 లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978 లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు. 1985 లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీలో, 1988 లో కేంద్ర కార్యవర్గంలో, 1999 లో పొలిట్‌ బ్యూరోలో ఏచూరికి చోటు దక్కింది. 2005 లో బెంగాల్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015 లో విశాఖపట్నంలో జరిగిన 21 వ మహాసభలో మొదటిసారిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైయ్యారు. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 22 వ మహాసభలో రెండో సారి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

రాజ్యసభ చరిత్రలోనే..
పార్లమెంటు దృష్టికి ఎన్నో ముఖ్యమైన సమస్యలను తీసుకురావటంతోపాటు వాటిపై ప్రశ్నలు సంధించిన సభ్యునిగా రాజ్యసభలో ఏచూరి గుర్తింపు పొందారు. సమస్యలను సభ దృష్టికి తేవడానికి పార్లమెంటును అడ్డుకోవడాన్ని ఏచూరి సమర్థిస్తారు. ప్రజాస్వామ్యబద్ధ పాలనలో చట్టబద్ధమైన అంశమని పేర్కొంటారు. 2015 మార్చి 3 న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన సవరణ ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలోనే ఇలా జరగటం నాలుగోసారి. 

ఇష్టాయిష్టాలు
ఎక్కువగా పుస్తకాలు చదువుతుంటారు. భగవద్గీతను, మహాభారతం లాంటి ఇతిహాసాలను చదివారు. టెన్నిస్‌ ఆట అంటే ఇష్టం. విద్యార్థి దశలో టెన్నిస్‌ ఆడేవారు.1968లో నిజాం కాలేజీ ఛాంపియన్‌ను కూడా. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక హిందూస్థాన్‌ టైమ్స్‌లో కాలమ్స్‌ రాస్తుంటారు.
- ఆంజనేయులు శెట్టె

>
మరిన్ని వార్తలు