బ్రహ్మాండం బద్దలు కాలేదేం!

11 Feb, 2018 03:38 IST|Sakshi
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి

భీమవరం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి:  ‘‘రాష్ట్రాన్ని విభజిస్తే తలెత్తే సమస్యలను ముందుగానే పసిగట్టాం. అందుకే సమైక్య రాష్ట్రానికి మద్దతుగా నిలిచాం. నాలుగేళ్లక్రితం చంద్రబాబును అడిగా.. పదేళ్లు బీజేపీతో సావాసం చేశావు కదా, గుణపాఠం నేర్చుకోలేదా? మళ్లీ వాళ్లతోనే ఎందుకు వెళ్తున్నావు అని ప్రశ్నించా. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉంది, రాబోయే రోజుల్లో మేమిద్దరం కలిసి రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం, బ్రహ్మాండం బద్దలు కొడతాం, చూస్తూ ఉండండి అన్నాడు. చివరకు ఏమైంది? ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు, పదేళ్లు ఇస్తామని మొదటికే మోసం చేశారు. హోదా బదులు ప్యాకేజీ అన్నారు, చివరకు దాన్నీ లేకుండా చేశారు. ఇప్పుడేమో టీడీపీ వాళ్లు వచ్చి సీపీఎం సహకారం కావాలని అడుగుతున్నారు.

మేము మద్దతిచ్చేది ప్రజలకోసమే తప్ప పార్టీలకోసం కాదు’’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తేల్చిచెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శనివారం సీపీఎం రాష్ట్ర 25వ మహాసభలు ప్రారంభమయ్యాయి. పార్టీ పాలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి పి.మధు, తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గఫూర్, హైమావతి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు