‘సైనిక దాడులను రాజకీయం చేస్తున్నారు’

4 Mar, 2019 17:28 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికల్లో లబ్ది పొందడం కోసం సైనిక దాడులను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రాజకీయం చేస్తున్నారని సీపీఎం కేంద్ర ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంలో దేశ ఆర్థిక వృద్ధిరేటు పడిపోయిందని, నిరద్యోగ సమస్య పెరిగిందని ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కశ్మీర్‌ సమస్యను పరిష్కరించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందన్నారు. కశ్మీరీలను పరాయి వారిగా చూడడం దగదన్నారు. అనుభవం లేని సంస్థలకు విమానాశ్రాయాల ప్రైవేటీకరణ అప్పగించారని విమర్శించారు. ఆధార్‌ డేటాబేస్‌ను ప్రైవేట్‌ సంస్థలు ఉపయోగించుకునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి​ఆమోదం తెలపకూడదని డిమాండ్‌ చేశారు.

ఏపీలో పవన్‌తో కలిసి పోటీ చేస్తాం
రానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏపీలో పవన్‌ కల్యాణ్‌, సీపీఐలతో కలిసి పోటీ చేస్తామని ఏచూరి స్పష్టం చేశారు. తెలంగాణలో సీపీఐ, బీఎల్‌ఎఫ్‌లతో కలిసి పోటీ చేస్తామన్నారు. సీట్లపంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. బీహార్‌లో ఆర్జేడీతో పొత్తులో భాగంగా ఒక్క సీటులో పోటీ చేస్తామన్నారు. తమిళనాడులో డీఎంకేతో పొత్తు పెట్టుకుంటామని, సీట్ల కోసం చర్చలు జరుపుతున్నామని చెప్పారు. ఒడిశాలో భువనేశ్వర్‌ ఎంపీ సీటుకు పోటీ చేస్తామన్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ, తృణమూల్‌కు వ్యతిరేకంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. లెఫ్ట్‌ ప్రంట్‌, కాంగ్రెస్‌ సిట్టింగ్‌ సీట్లలో ఒకరిపై ఒకరు పోటీ చేయవద్దని ప్రతిపాదన చేసుకున్నామని పేర్కొన్నారు. కేరళలో ఎల్‌డీఎఫ్‌, యూడీఎప్‌ల మధ్యే పోటీ ఉంటుదన్నారు. కేరళలో ఈ సారి ఎక్కువ సీట్లు గేలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు