అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేయాల్సిన అవసరమేంటి?

3 Aug, 2019 13:53 IST|Sakshi

సాక్షి, గుంటూరు : జమ్మూకశ్మీర్‌లో కేంద్ర ప్రభుత్వం భయానక వాతావరణం సృష్టిస్తోందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. అత్యవసరంగా 40వేల మంది సైనికులను కశ్మీర్‌కు ఎందుకు తరలించారో కేంద్రం చెప్పాలని డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మక అమర్‌నాథ్‌ యాత్రను అర్థాంతరంగా నిలిపివేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్‌ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పడం ద్వారా కశ్మీర్‌లో ప్రభుత్వం భయం రేకెత్తిస్తోందన్నారు. అసలు కశ్మీర్‌లో ఏం జరుగుతుందో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

కాగా, అమర్‌నాథ్‌ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం అనూహ్య ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్‌ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ శుక్రవారం హెచ్చరించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్‌ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం సూచించింది. దీంతో స్థానిక కశ్మీర్‌ ప్రజల్లోనూ భయాందోళనలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు