ఏచూరికి మరో చాన్స్‌ దక్కేనా? 

18 Apr, 2018 01:49 IST|Sakshi
సీతారాం ఏచూరీ, ప్రకాశ్‌ కారత్‌

సీపీఎంలో ముదిరిన గ్రూపు రాజకీయాలు

సీతారాంకు అడ్డుపడుతున్న కారత్‌ వర్గం

తెరపైకి మాణిక్‌ సర్కార్, బృందా కారత్‌ల పేర్లు

22న కొత్త ప్రధాన కార్యదర్శి ఎన్నిక  

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేదానిపై కామ్రేడ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీతారాం అనుకూల, వ్యతిరేక వర్గాలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరో వర్గం.. త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ కాంగ్రెస్‌ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సమావేశాల చివరిరోజైన ఏప్రిల్‌ 22న కొత్త ప్రధాన కార్యదర్శి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం వెల్లడించింది. 

ఏచూరీ వర్సెస్‌ కారత్‌ : పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకుని ఈఎంఎస్‌ నంబూద్రిపాద్, హరికిషన్‌ సింగ్‌ సుర్జిత్, ప్రకాశ్‌ కారత్‌ వరకు అందరూ కనీసం మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇదే సంప్రదాయం ప్రకారం.. సీతారాం ఏచూరీయే మరోసారి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. కానీ పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళ గ్రూపుల్లో స్పష్టమైన విభేదాలు పొడసూపాయి. దీనికి తోడు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్‌ కారత్, సీతారాం ఏచూరీ మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది.  
 
ఎన్నికలు అనివార్యమేనా..! 
ప్రకాశ్‌ కారత్‌కు కేరళ సీఎం పినరయి విజయన్‌ నుంచి బలమైన మద్దతుంది. దీనికితోడు పలు రాష్ట్రాల కామ్రెడ్లూ కారత్‌ వెంటే ఉన్నామంటున్నారు. 16 మంది సభ్యులున్న పొలిట్‌ బ్యూరో, 85 మంది సభ్యులున్న సెంట్రల్‌ కమిటీల్లో కారత్‌కే బలమైన మద్దతుంది. అయితే, ఏచూరీకి  బలమైన మద్దతు లేదు. దీనికి తోడు, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసిపనిచేయటమే మంచిదని మొదట్నుంచీ ఈయన చెబుతూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కారత్, ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్‌ కామ్రెడ్లు మాత్రం ఏచూరీ ఆలోచన నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉందని.. కారత్‌ వ్యూహం స్టాలిన్‌ కాలం నాటి ఆలోచన అని అంటున్నారు. 21నాటి సమావేశంలో పార్టీ సెంట్రల్‌ కమిటీయే కొత్త ప్రధాన కార్యదర్శిపై నిర్ణయం తీసుకోనుంది. ఏచూరీ కాకుండా మరెవరైనా ఆసక్తి కనబరిస్తే.. ఎన్నికలు అనివార్యమే.   
 
ఏచూరీయే.. లేదంటే చీలికే? 
మరోవైపు ఏచూరీ, కారత్‌ల వ్యతిరేక వర్గం త్రిపుర మాజీ సీఎం మాణిక్‌ సర్కార్‌ను తెరపైకి తెచ్చేందుకు యోచిస్తోంది. అటు మహిళలకు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అదే జరిగితే.. ప్రకాశ్‌ కారత్‌ భార్య బృందా కారత్‌ ఒక్కరే పోటీదారు. పలువురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవికోసం తెరపైకి వస్తున్నప్పటికీ.. ఏచూరీకి మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో పార్టీలో భారీ చీలిక తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.   

మరిన్ని వార్తలు