హస్తం గూటికి బీఎస్పీ ఎమ్మెల్యేలు

18 Sep, 2019 02:32 IST|Sakshi

రాజస్తాన్‌లో బీఎస్పీకి షాక్ 

కాంగ్రెస్‌ నమ్మకద్రోహం చేసింది: మాయావతి

జైపూర్‌/లక్నో: బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ అధినేత్రి మాయావతికి ఆ పార్టీకి చెందిన రాజస్తాన్‌ ఎమ్మెల్యేలు షాక్‌ ఇచ్చారు. ఆరుగురు ఎమ్మెల్యేలతో ఆ రాష్ట్ర బీఎస్పీ లెజిస్లేచర్‌ పార్టీ మొత్తం కాంగ్రెస్‌లో విలీనమైంది.ఈ మేరకు బీఎస్పీ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు లేఖ సమర్పించారు. ఈ అంశంపై మంగళవారం ట్విట్టర్‌లో స్పందించిన మాయావతి.. కాంగ్రెస్‌ ఎప్పటికీ నమ్మదగ్గ భాగస్వామి కాదనేందుకు ఇది తాజా తార్కాణమని వ్యాఖ్యానించారు. రాజస్తాన్‌లోని రెండు అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నికలతోపాటు మున్సిపల్‌ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఈ రాజకీయ మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. రాజస్తాన్‌ అసెంబ్లీలో మొత్తం 200 స్థానాలు ఉండగా ప్రస్తుతం కాంగ్రెస్‌ బలం 106గా ఉంది. బీఎస్పీ ఎమ్మెల్యేలు రాజేంద్ర సింగ్, జోగిందర్‌ సింగ్‌ అవానా, వాజిబ్‌ అలీ, లఖన్‌ సింగ్‌ మీనా, సందీప్‌ యాదవ్, దీప్‌ చంద్‌లు సోమవారం రాత్రి అసెంబ్లీ స్పీకర్‌ జోషిని కలిసి తామంతా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు లేఖ అందించారు.. 

నమ్మకద్రోహం: మాయావతి 
బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ తన పార్టీలోకి కలిపేసుకోవడం నమ్మకద్రోహమని బీఎస్పీ అధినేత్రి మంగళవారం విరుచుకుపడ్డారు. ప్రత్యర్థులపై పోరాడటం మానేసి కాంగ్రెస్‌ ఎప్పుడూ తనకు సహకరించే, మద్దతిచ్చే పార్టీలకే నష్టం చేకూరుస్తూ ఉంటుందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ ఓబీసీ వర్గాలకు ఈ పార్టీ బద్ధ వ్యతిరేకి అని, ఈ వర్గాల రిజర్వేషన్ల విషయంలో ఏనాడూ కాంగ్రెస్‌ నిజాయితీగా వ్యవహరించలేదని ట్వీట్‌లో పేర్కొన్నారు. అంబేద్కర్‌ సిద్ధాంతాలను కాంగ్రెస్‌ ఎప్పుడూ వ్యతిరేకించేదని, అందుకే అప్పట్లో అంబేద్కర్‌ న్యాయశాఖ మంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చిందని విమర్శించారు. లోక్‌సభకు ఎన్నిక కానీయకుండా, భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్‌ అంబేద్కర్‌ను ఇబ్బందులు పెట్టిందన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా