ఉత్తమ్‌ 'సిక్స్‌ ప్యాక్‌'

19 Nov, 2018 01:29 IST|Sakshi

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెనుక ఆ ఆరుగురు

ఎన్నికల ఫైట్‌లో ‘పైలెట్‌’కు వారే వెన్నుదన్ను

దేశ రక్షణ కోసం యుద్ధ విమానాలు నడిపిన టీపీసీసీ చీఫ్‌ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. ఇప్పుడు ఎన్నికల రణరంగంలో ప్రత్యర్థులతో తలపడుతున్నారు. ప్రజాకర్షణ, వాక్పటిమ కలిగి రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను ఢీకొడుతున్న కాంగ్రెస్‌ బృందాన్ని ముందుండి నడిపిస్తున్న పైలెట్‌ ఈయన. అధికార పార్టీ ఎత్తులకు పైఎత్తులు వేస్తూ.. ‘ముందస్తు’ వ్యూహంతో ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి మహా కూటమి పేరుతో ఎన్నికల రణానికి బయల్దేరిన ఈ మాజీ కెప్టెన్‌ ఆంతరంగిక బలమేంటి? అటు పార్టీని నడపడంలో, ఇటు ఎన్నికల తంత్రాలను పన్నడంలో వెన్నుదన్నుగా నిలుస్తున్నదెవరు? ఉత్తమ్‌ ‘సిక్స్‌ప్యాక్‌’ టీం పరిచయమిది..

పద్మావతిరెడ్డి
ఆమె ఆర్కిటెక్ట్‌. వాస్తుకు అనుగుణంగా అందమైన ఇళ్లకు డిజైన్‌ వేసే వృత్తిలో ఉన్న ఆమె తన భర్తనూ అంతే బలంగా ‘డిజైన్‌’ చేయడంలో సఫలీకృతులయ్యారు. కష్టకాలంలో ఉత్తమ్‌ బలం ఆమె. రాజకీయంగా క్లిష్ట సమస్యలు వచ్చినప్పుడు ఉత్తమ్‌కు దిక్సూచిగా నిలుస్తారు. టీపీసీసీ చీఫ్‌ హోదాలో ఆయన బిజీగా ఉంటే నియోజకవర్గంలో అన్ని పనులు చక్కబెడుతుంటారు. ఉత్తమ్‌ తరఫున కేడర్‌ మంచిచెడ్డలు చూస్తుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్కిటెక్ట్‌ మాత్రమే కాదు .. ఉత్తమ్‌ను రాజకీయంగా తీర్చిదిద్దిన పొలిటికల్‌ డిజైనర్‌ కూడా.

గూడూరు నారాయణరెడ్డి
టీపీసీసీ కోశాధికారి. ఈయన వెంట ఉంటే ఉత్తమ్‌కు సగం భారం తగ్గినట్టే. అధ్యక్షుని హోదాలో రాష్ట్ర పార్టీని నడిపించాల్సిన ఉత్తమ్‌ బాధ్యతల్లో సగం ఈయనే పంచుకుంటారు. కోశాధికారిగా పార్టీ ఆర్థిక వ్యవహారాలన్నింటినీ చక్కబెడుతుంటారు. జాతీయ పార్టీ పక్షాన ఢిల్లీ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ముఖ్య నాయకుల అతిథి మర్యాదలు పర్యవేక్షిస్తారు. పార్టీ అంతర్గత సమస్యలను పరిష్కరించడంలోనూ సాయపడతారు. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఉత్తమ్‌కు అండగా నిలుస్తారు. గూడూరు టీపీసీసీ కోశాధికారే కాదు... ఉత్తమ్‌ ఆంతరంగిక సహకారి.

దాసోజు శ్రావణ్‌
రాజకీయ ప్రత్యర్థులపై ఉత్తమ్‌ ఎక్కుపెట్టే బాణం ఈయన. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన శ్రావణ్‌ స్వతహాగా వాక్పటిమ ఉన్న నాయకుడు. ఏ అంశం మీదైనా పరిశోధన చేయడంలో దిట్ట. అందుకే అధికార పార్టీపై దాడికి శ్రావణ్‌ను ఎంచుకుంటారు ఉత్తమ్‌. అదీ..ప్రత్యక్షంగా లేదంటే పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్లు, డాటా అనాలసిస్, సామాజిక మాధ్యమాల రూపంలో. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో నైపుణ్యం ఉన్న శ్రావణ్‌ పార్టీ మేనిఫెస్టో రూపకల్పన, ప్రచార కార్యక్రమాల రూపకల్పనలో కీలకం. ఉత్తమ్‌ పార్టీ ప్లటూన్‌లో వాగ్బాణాలు సంధించే మాటల శతఘ్ని. 

సీజే శ్రీనివాస్‌
మాజీ ఉప ముఖ్యమంత్రి సి.జగన్నాథరావు కుమారుడు. పార్టీకి, ఉత్తమ్‌కు మధ్య వారధిగా పనిచేస్తారు. బూత్‌కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, శక్తియాప్‌ లాంటివి ఈయనే పర్యవేక్షిస్తారు. ఏఐసీసీ ఇచ్చే పార్టీ కార్యక్రమాలన్నింటినీ ఉత్తమ్‌ పక్షాన చక్కబెడతారీయన. డాటా అనాలిసిస్‌లోనూ తోడుగా ఉంటారు. పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల బయోడేటాలన్నీ క్రోడీకరించి ఉత్తమ్‌ పని సులువు చేశారు. పార్టీ సంస్థాగత కార్యక్రమాల పరంగా ఉత్తమ్‌కు కొండంత బలం శ్రీనివాస్‌. 

హర్కర వేణుగోపాల్‌
ఏఐసీసీ ప్రొటోకాల్‌ ఇన్‌చార్జి. అధిష్టాన పెద్దల రాష్ట్ర పర్యటనల భారమంతా ఈయనదే. రాహుల్, సోనియాగాంధీ.. ఇంకా అగ్రనేతలు ఎవరు రాష్ట్రానికి వచ్చినా వారు బయలుదేరినప్పటి నుంచీ వెళ్లే వరకు వెన్నంటి ఉండి, ఏ లోటూ రాకుండా చూసుకుంటారు. జాతీయ నాయకులు బసచేసే హోటళ్లలో ఏర్పాట్లు, భోజన సదుపాయాలు, సెక్యూరిటీ వ్యవహారాలన్నీ ఉత్తమ్‌ తరపున చూసుకునేది ఈయనే. రాహుల్, సోనియాల ఎన్నికల ప్రచార సభల షెడ్యూల్‌ ఖరారులోనూ ఈయనే కీలకం. అధిష్టానానికి, ఉత్తమ్‌కు మధ్య వారధి. 

కప్పర హరిప్రసాదరావు
టీపీసీసీ ప్రజాసంబంధాల అధికారి. మీడియాకు, ఉత్తమ్‌కు మధ్య సమన్వయం, పార్టీ ప్రచార కార్యక్రమాలు, పీసీసీ అధ్యక్షుడి కార్యక్రమాల కవరేజిలో హరిప్రసాద్‌ పాత్ర కీలకం. పార్టీ ప్రచారం విషయంలో అవసరమైన ఇన్‌పుట్స్‌ అన్నీ ఉత్తమ్‌కు అందిస్తారు. ప్రత్యర్థి పార్టీల ఆరోపణలను తిప్పికొట్టే విషయంలోనూ, పార్టీ లైన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ ఉత్తమ్‌ స్క్రిప్ట్‌ ఈయనే. రాజకీయంగా కీలక సమయంలోనూ అవసరమైన సమాచారం ఇస్తుంటారు. ఉత్తమ్‌ మీడియా డ్రాఫ్ట్స్‌మెన్‌ ఈయన.
..:: మేకల కల్యాణ్‌ చక్రవర్తి

>
మరిన్ని వార్తలు