నాలుగేళ్లలో అరవై ఏళ్ల దోపిడీ

3 Oct, 2018 03:49 IST|Sakshi
తెరవే మహాసభలో మాట్లాడుతున్న అందెశ్రీ

     టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై కవి అందెశ్రీ ధ్వజం 

     సర్కారు పుణ్యమా అని కవులూ విడిపోయారని ఆవేదన 

     కామారెడ్డిలో తెలంగాణ రచయితల వేదిక జిల్లా మహాసభలు  

కామారెడ్డి అర్బన్‌: ఉద్యమాలు, అమరుల బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అరవై ఏళ్లలో కాని దోపిడీ ఈ నాలుగేళ్లలో జరిగిందని కవి అందెశ్రీ ఆరోపించారు. మంగళవారం కామారెడ్డిలో జరిగిన తెలంగాణ రచయితల వేదిక(తెరవే) జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ‘తెలంగాణ సమా జం– భరోసాలు –తీరు తెన్నులు’అనే అంశంపై అందెశ్రీ మాట్లాడారు. ‘నాడు నిజాం పైజామాను ఊడగొట్టి.. రజాకార్లను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలంటే అలుసా అని ప్రశ్నించారు.

రాచరిక పాలనకు చరమగీతం పాడిన ప్రజలపై పాలకులు చిన్నచూపు చూడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పుణ్యమా అని నేడు రాష్ట్రంలో కవులు రెండుగా విడిపోయారని అందెశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రజల్లో నిలబెట్టడానికి కవులు తమ కలాలను ప్రజల పక్షాన నిలపాల్సిన అవసరం ఉందన్నారు. 105 మందిని గెలిపించుకుంటానన్న వ్యక్తి.. ప్రజల ఆశీర్వాదం పేరిట మర్నాడే çహుస్నాబాద్‌ సభ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని నిలదీశారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సర్కారు సంచి కోసం కవులు దేబరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు.  

ప్రజలను ఓటర్లుగానే చూస్తున్నారు...
తెలంగాణలో నేడు ప్రజలను ఓటర్లుగానే చూసే దుస్థితి వచ్చిందని, ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సమయం ఆసన్నమైందని తెరవే రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ జయధీర్‌ తిర్మల్‌రావు పేర్కొన్నారు.   మేధావిలోకం నాలుగేళ్లుగా నిశబ్దంలోకి జారిపోయిం దని పేర్కొన్నారు. కాళేశ్వరం కవులు, ప్రజాక్షేత్రం కవులు అని రెండు శిబిరాలుగా సాహితీ జీవులు విడిపోయారన్నారు. తెరవే అఖిల భారత అధ్యక్షుడు జూకంటి జగన్నాథం, రచయితలు అల్లం రాజయ్య, సీహెచ్‌ మధు తదితరులు ప్రసంగించారు. 

మరిన్ని వార్తలు