సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన స్మృతి ఇరానీ

29 May, 2020 11:10 IST|Sakshi

న్యూఢిల్లీ: వలస కూలీల వెతలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తీవ్రంగా ఖండించారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ లబ్ధి పొందాలని చూస్తుందంటూ ఆమె ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. ‘కోవిడ్‌-19కు వ్యతిరేకంగా దేశం ఐక్యంగా నిలబడాల్సిన సమయంలో ప్రతిపక్షాలు స్వంత ప్రయోజనాలు చూసుకోవడం నిజంగా దురదృష్టకరం. సంక్షోభ సమయంలో సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ నీచ రాజకీయాలకు అద్దం పడుతున్నాయి. కాంగ్రెస్‌ నాయకులు దేశ ఐక్యతను విచ్ఛినం చేసి.. తాము లబ్ధి పొందాలని చూస్తున్నారు. వారి ప్రయత్నాలు చూస్తే నాకు ఆశ్చర్యంగా ఉంది. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ పాలిత  ప్రభుత్వాలతో సహా ప్రతి  రాష్ట్రానికి కేంద్రం ‘పీఎమ్‌ గరీబ్‌ కళ్యాణ్‌ యోజన’ ద్వారా 1.76 లక్షల కోట్ల రూపాయలు లబ్ది చేకూర్చింది. ఈ పథకం దేశంలోని బలహీన వర్గాలకు అండగా నిలిచింది’ అన్నారు.(వారి ఆవేదన ప్రభుత్వానికి పట్టదు!)

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, జిల్లా అధికారులంతా ఈ సంక్షోభ సమయంలో ఒక్క చోట చేరి కరోనా కట్టడి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్‌ పార్టీ, కేంద్రంపై రాజకీయ విమర్శలు చేయడం సిగ్గు చేటు అన్నారు. దేశ నిర్మాణాత్మక అభివృద్ధికి కాంగ్రెస్‌ పార్టీ ఏమాత్రం దోహదపడదని ఆమె ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్‌ పార్టీ నీచ రాజకీయాలు చేయడం మానాలని స్మృతి ఇరానీ సూచించారు. (‘అబ్బాయిలు కూడా తెలుసుకోవాలి’)

మరిన్ని వార్తలు