రాహుల్‌ సవాల్‌కు ఇరానీ కౌంటర్‌!

20 Nov, 2018 10:53 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రాఫెల్‌ కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విసిరిన సవాల్‌పై కేంద్ర జౌళీ శాఖ మంత్రి స్మృతి ఇరానీ స్పందించారు. రాఫెల్‌తో పాటు దేశానికి సంబంధించిన అంశాలపై చర్చకు తాము సిద్ధమని, కానీ రాహుల్‌ చర్చకు వచ్చేముందు చేతిలో ఎలాంటి పేపర్లు (స్క్రిప్ట్) లేకుండా చర్చించగల సత్తా ఆయనకు ఉందా అని ఆమె ప్రశ్నించారు.  ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ప్రచారంలో ఇటీవల రాహుల్‌ మాట్లాడుతూ.. రాఫెల్‌పై తనతో చర్చకు ప్రధాని మోదీ సిద్ధమేనా? అని సవాలు విసిరిన విషయం తెలిసిందే. దీనిపై ఇరానీ సోమవారం ఓ సమావేశంలో మాట్లాడుతూ.. గత 15 ఏళ్లుగా అమేథిలో రాహుల్‌ ఎంపీగా విజయం సాధిస్తూ వస్తున్నారని.. తన సొంత నియోజకవర్గంలోని కొన్ని గ్రామపంచాయతీల పేర్లు కూడా రాహుల్‌ చెప్పలేరని ఆమె ఎద్దేవా చేశారు.

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ  నుంచి రాహుల్‌ వరకు అమేథిని పాలించింది వారి కుటుంబమేనని.. అక్కడ అభివృద్ది ఏమేరకు జరిగిందో ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌ పోటీ చేసిన ఇరానీ స్వల్ప తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేథి లోక్‌సభ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో మూడింటిని బీజేపీ గెలుపొందగా, ఒక స్థానంలో ఎస్పీ విజయం సాధించింది.

మరిన్ని వార్తలు