కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?

16 Sep, 2019 14:54 IST|Sakshi

కోడెల-కొడుకు మధ్య మనస్పర్థలు ఉన్నట్టు ప్రచారం

కోడెల మృతి చుట్టూ అనేక ప్రశ్నలు, సందేహాలు

ఆయనది ఆత్మహత్యా? గుండెపోటుతో మృతా?

నిమ్స్‌ కాదని బవసతారకం ఆస్పత్రికి ఎందుకు తీసుకొచ్చారు?

నిన్న రాత్రి కోడెల ఇంట్లో ఏం జరిగింది?

సాక్షి, హైదరాబాద్‌: టీడీపీ సీనియర్‌ నేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అర్ధంతర మృతి.. ఆ తర్వాత తెరపైకి వచ్చిన పలు కథనాలు, వదంతులతో అనేక సందేహాలను లేవనెత్తుతున్నాయి. కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? ఆయన గుండెపోటుతో హఠాన్మరణం చెందారా? లేక మరేదైనా కారణముందా?.. ప్రస్తుతం అందరినీ తొలస్తున్న ప్రశ్నలివే. కోడెల శివప్రసాదరావు హైదరాబాద్‌లోని తన నివాసంలో ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్టు కథనాలు వచ్చాయి. లేదు, డాక్టర్‌ అయిన కోడెల ప్రమాదకరమైన ఇంజెక‌్షన్‌ చేసుకొని.. ఆత్మహత్య చేసుకున్నారని మరో కథనం ప్రచారంలోకి వచ్చింది.

అసలు ఆదివారం రాత్రి కోడెల ఇంట్లో ఏం జరిగిందన్నది తెలియాల్సి ఉంది. రెండ్రోజుల కిందటే కోడెల హైదరాబాద్‌లోని తన ఇంటికి వచ్చారని సన్నిహితులు చెప్తున్నారు. కొడుకు శివరాం పిలువడం వల్లే ఆయన హైదరాబాద్‌ వచ్చారని అంటున్నారు. కోడెలకు, ఆయన తనయుడికి మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారమూ సాగుతోంది. అయితే ఆయన కుమారుడు శివరాం విదేశీ పర్యటనలో ఉన్నారని, రేపు ఉదయం ఆయన హైదరాబాద్‌ చేరుకుంటారని సమాచారం.

కోడెల పిరికివారు కాదు..
రెండు రోజులుగా కోడెలకు-ఆయన కొడుకుకు మధ్య గొడవ జరిగిందని, తండ్రి కోడెలపై కొడుకు చేయి చేసుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కోడెల ఆత్మహత్య చేసుకొని ఉంటారు అని చెప్తున్నారు. అయితే, ఆయన సన్నిహితులు మాత్రం కోడెలది ఆత్మహత్య కాకపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు. రాజకీయ నాయకుడు, వృత్తిరీత్యా వైద్యుడు అయిన కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని వారు అంటున్నారు.

కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు!
కోడెల ఆకస్మిక మృతి వ్యవహారంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో అస్వస్థతకు గురయ్యారా? అన్నది ఒక ప్రశ్న కాగా.. ఆదివారం రాత్రి కోడెలను బసవతారకం ఆస్పత్రిలో చేర్పించిందెవరు? అనేది మరో ప్రశ్న. అంతేకాకుండా కోడెల కోడుకు బసవతారకం ఆస్పత్రికి రాలేదని తెలుస్తోంది. తండ్రి విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో ఉన్నా కొడుకు ఎందుకు రాలేదు? ప్రస్తుతం కోడెల కొడుకు ఎక్కడ ఉన్నాడు? తండ్రి మృతి విషయం అతనికి తెలుసా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు కోడెలను అత్యవసరంగా బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో చేర్చడంపైనా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కోడెల నివాసం పంజాగుట్టలోని నిమ్స్‌ ఆస్పత్రికి సమీపంలో ఉంది. అయినా నిమ్స్‌ ఆస్పత్రిలో కాకుండా బసవతారకం ఆస్పత్రికి ఆయనను ఎందుకు తరలించారో తెలియాల్సి ఉంది. మొత్తానికి కోడెల ఆత్మహత్య చేసుకున్నారా? లేక గుండెపోటుతో మృతి చెందారా? అన్నది పోస్టుమార్టం నివేదికతో వెల్లడయ్యే అవకాశముంది. ప్రస్తుతం బంజారాహిల్స్‌ పోలీసులు ఆ దిశగా విచారణ జరుపుతున‍్నారు. అయితే పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదికలో కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్థారణ అయింది.

మరిన్ని వార్తలు