టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం!

23 Oct, 2018 01:46 IST|Sakshi
స్క్రీనింగ్‌ కమిటీ భేటీ నుంచి వస్తున్న దామోదర, సంపత్, అద్దంకి దయాకర్‌

     అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పార్టీ సుదీర్ఘ కసరత్తు 

     అభిప్రాయాలు సేకరించిన స్క్రీనింగ్‌ కమిటీ  

     తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలతో చర్చలు 

     హస్తిన రావాలని కుంతియా, ఉత్తమ్‌లకు పిలుపు 

     ఈ నెలాఖరు లేదా నవంబర్‌ మొదటివారంలో జాబితా?

సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపుపై సోమవారం ఇక్కడి వార్‌రూమ్‌లో ఆయా రాష్ట్రాల ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలతో సమావేశమయ్యాయి. తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ ఆదివారం బీసీ నేతలతో చర్చించగా.. సోమవారం ఎస్సీ, ఎస్టీ నేతల అభిప్రాయాలు సేకరించింది. ఆయా స్థానాల్లో ఏయే ఉప కులానికి ఎంత బలం ఉంది? టికెట్‌ ఆశిస్తున్నవారికి విజయావకాశాలు ఎలా ఉంటాయి? ఏయే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి.. అనే అంశాలపై నేతల నుంచి సమాచారాన్ని సేకరించాయి.

తెలంగాణ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ఆరేపల్లి మోహన్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టి విక్రమార్క, మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ దామోదర రాజనర్సింహ, సీనియర్‌ నేత గీతారెడ్డి తదితరుల నుంచి తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు భక్తచరణ్‌దాస్, షర్మిష్టా ముఖర్జీ, జ్యోతిమణి సెన్నిమలై అభిప్రాయాలు సేకరించారు. ఎస్టీ సామాజిక వర్గం నుంచి అఖిల భారత ఆదివాసీ కాంగ్రెస్‌ సభ్యులు బలరాం నాయక్, సీతక్క, బీసీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ఓబీసీ నేత చిత్తరంజన్‌దాస్‌ తదితరులు హాజరయ్యారు. రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లో ఎవరైతే గెలుస్తారు, సామాజిక వర్గాల వారీగా ఏ అభ్యర్థులను ఎంచుకోవాలి, ఎస్సీ, ఎస్టీలకు దగ్గర కావాలంటే ఏరకమైన కార్యాచరణ రూపొందించుకోవాలనే అంశాలపై స్క్రీనింగ్‌ కమిటీ.. గ్రూపులవారీగా, విడివిడిగా చర్చలు జరిపింది. గతంలో కేవలం పీసీసీ అధ్యక్షులు, ఇతర బాధ్యులతో మాత్రమే చర్చించి టికెట్లు ఖరారుచేసే సంప్రదాయం ఉన్న కాంగ్రెస్‌ పార్టీలో, ఏకంగా స్క్రీనింగ్‌ కమిటీ హైదరాబాద్‌కు వచ్చి చర్చలు జరపడం, ఆ తర్వాత వివిధ సామాజిక వర్గాల నేతలను ఢిల్లీ పిలిపించుకుని వారి అభిప్రాయాలను తీసుకోవడం పార్టీలో చర్చనీయాంశమవుతోంది. 

నేడు కుంతియా, ఉత్తమ్‌లతో భేటీ... 
పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌.సి.కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో తెలంగాణ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీ భేటీ కానుంది. వెంటనే ఢిల్లీ రావాలంటూ పిలుపు రావడంతో వారిద్దరూ సోమవారం సాయంత్రానికి హస్తిన చేరుకున్నారు. మంగళవారం స్క్రీనింగ్‌ కమిటీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలపై వారిద్దరి అభిప్రాయాలను మరోమారు తీసుకుంటుందని సమాచారం. బుధవారం భక్తచరణ్‌దాస్‌ బృందం మళ్లీ హైదరాబాద్‌కు వచ్చి తుదిదశ సంప్రదింపులు జరిపిన అనంతరం గురువారం ఏకే ఆంటోనీ నేతృత్వంలోని ఏఐసీసీ ఎన్నికల కమిటీకి తుది జాబితా సమర్పిస్తుందని, ఈనెలాఖరు లేదం టే నవంబర్‌ మొదటి వారంలోపే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. కాగా, మహాకూటమి సీట్ల సర్దుబాటుపై చర్చించేందుకు ఉత్తమ్‌ మంగళవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ నేతలతో సమావేశం అవుతారని సమాచారం.  

ఓ వైపు కసరత్తులు.. మరోవైపు ఫిర్యాదులు
ఓ వైపు సామాజిక న్యాయంపై ఢిల్లీలో కసరత్తు సాగుతుండగానే సామాజిక న్యాయం కొరవడిందంటూ ఢిల్లీకి ఫిర్యాదు చేరింది. ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై గెలిచిన ఓబీసీ నేత చిత్తరంజన్‌ దాస్‌కు, విదేశీయురాలనే ప్రచారానికి మనస్తాపం చెంది ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నప్పుడు నిరాహార దీక్ష చేసిన కొమిరెడ్డి రాములు, జ్యోతి దంపతులకు టికెట్‌ రాకుండా పార్టీలోని కొందరు నేతలు  ప్రయత్నిస్తున్నారని రాహుల్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చిత్తరంజన్‌ దాస్, కొమిరెడ్డి విజయ్‌ ఆజాద్‌.. రాహుల్‌ గాంధీకి లేఖ రాశారు. 

అభిప్రాయాలు వినిపించాం: దామోదర 
స్క్రీనింగ్‌ కమిటీ సభ్యులు తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులను ఆహ్వానించారు. ఎన్నికల వ్యూహ రచన ఎలా ఉండాలి? అభ్యర్థుల ఎంపిక ఎలా ఉండాలనే అంశాలపై అభిప్రాయ సేకరణ జరిగింది. జనరల్‌ స్థానాల్లోనూ గెలిచే అభ్యర్థులుంటే వాటిని కూడా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలన్న చర్చ జరిగింది. మేనిఫెస్టో అంశాలపై కూడా చర్చించాం. త్వరలోనే సమగ్రంగా రూపకల్పన చేసి విడుదల చేస్తాం. 

సమన్వయం కోసం: బలరాం నాయక్‌
స్థానికంగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులను ఎలా సమన్వయం చేసుకోవాలి. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణను ఎలా ముందుకు తీసుకెళ్లాలి? ఎలా గెలుపొందాలనే అంశాలపై కసరత్తు జరిగింది. ఎస్టీల్లో ఆదివాసీలు, బంజారాలు, ఎరుకల కులస్తులు మొత్తంగా 34 లక్షల ఓటర్లం ఉన్నాం. ఆయా ఉపకులాల సంఖ్యకు అనుగుణంగా టికెట్లు ఇవ్వడంపై చర్చ జరిగింది. టీఆర్‌ఎస్‌ గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చేసిన మోసం గిరిజనులకు వివరించాలన్న అంశం కూడా చర్చకు వచ్చింది.

మరిన్ని వార్తలు