ట్వీట్‌ హీట్‌

26 Apr, 2019 01:04 IST|Sakshi

రాజకీయాలంటేనే అదో రొంపి. అందులోకి దిగితే దేనినైనా దిగమింగుకోవాలి. అన్నీ భరిస్తూ ముందుకు వెళ్లాలి. ఇదేమీ కొత్త విషయం కాదు. ఇంటర్నెట్, సోషల్‌ మీడియా లేని రోజుల్లో కూడా బడా బడా నేతలకి కూడా ఈ అవమానాలు తప్పలేదు. ఇందిరాగాంధీ ప్రధాని పదవి చేపట్టిన కొత్తల్లో ఆమెని గూంగీ గుడియా (మూగ బొమ్మ) అని ఎగతాళి చేసేవారు. నరేంద్ర మోదీ గుజరాత్‌ సీఎంగా ఉన్న రోజుల్లో ఒకసారి సోనియాగాంధీని జెర్సీ ఆవుతో పోల్చి అవమానిస్తే ఆమె మోదీని దొంగ, మృత్యు వ్యాపారి అంటూ తిట్టి పోశారు. కొన్నేళ్ల క్రితం అప్పటి వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియా ఇటలీ కుక్క అంటూ సోనియాపై ధ్వజమెత్తారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టాక ఎవరికెన్ని అవమానాలు ఎదురైనా గత ఎన్నికల్లో సోషల్‌ మీడియా వేదికగా రాహుల్‌ గాంధీకి పప్పూ అన్న నిక్‌నేమ్‌ వైరల్‌ అయినంతగా మరేదీ కాలేదు. 2014 ఎన్నికల సమయంలో సోషల్‌ మీడియా ఎంత శక్తిమంతమైందో అంచనా వేయలేక రాహుల్‌ గాంధీ ట్విటర్‌ అకౌంట్‌ ప్రారంభించలేదు. అదే సమయంలో రాహుల్‌ పప్పూ ఇమేజ్‌పై లెక్కలేనన్ని మీమ్‌లు, జోక్‌లు, వీడియోలు విస్తృతంగా షేర్‌ అయ్యాయి. రాహుల్‌ పప్పూ కాకపోతే, ఆయన షెహజాదా (రాకుమారుడైతే వారసత్వంగా పదవి వస్తుందని ఎగతాళి చేయడం) అవుతారంటూ మోదీ ప్రచార వేడిని పెంచారు. ఇదంతా చూశాకే నరేంద్ర మోదీ ప్రధాని కావడానికి సోషల్‌ మీడియా ప్రభావం కూడా ఉందని విశ్లేషకులు భావించారు. ఆ తర్వాత సోషల్‌ మీడియా పరిధి మరింతగా పెరిగింది. దీంతో 2017లో రాహుల్‌ సోషల్‌ మీడియాలోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత ఒమర్‌ అబ్దుల్లా నుంచి ఎంకే స్టాలిన్‌ వరకు దేశవ్యాప్తంగా ఎందరో నాయకులు ట్విటర్‌లో ఖాతా తెరిచారు. గత ఏడాదిలో కాంగ్రెస్‌ నాయకులే ఎక్కువగా సోషల్‌ మీడియాలోకి ఎంటరయ్యారు. 

వ్యతిరేక ప్రచారంపైనే ఆసక్తి 
2017 జనవరి 1 నుంచి రాజకీయ నాయకులు చేసిన ట్వీట్లలో 19వేలకు పైగా విద్వేషపూరితంగా, అవమానకరంగా ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాంటి ట్వీట్లకే రీట్వీట్లు ఎక్కువగా వస్తున్నాయి. ఒక్కో ట్వీట్‌కు 32–101% రీట్వీట్లు వస్తున్నాయంటే నెటిజన్లని ఆకర్షిస్తున్న భాష ఏంటో అర్థమవుతుంది. ఈ మధ్య కాలంలో ట్విటర్‌లో రాజకీయ పార్టీలు చేస్తున్న నెగటివ్‌ ప్రచారమే వైరల్‌గా మారుతోంది. రాహుల్‌గాంధీ చేసే ట్వీట్లలో 50శాతం దుర్భాషలాడేలా ఉంటే ప్రధానమంత్రి మోదీ చేసే ట్వీట్లలో 10శాతం మాత్రమే వివాదాస్పదంగా మారుతున్నాయి. 

రీట్వీట్ల వీరుడు రాహుల్‌
కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ట్విటర్‌ రంగప్రవేశంతో ఈ రాజకీయ యుద్ధం కొత్త మలుపు తీసుకుంది. ప్రధాని నరేంద్రమోదీకి అత్యధికంగా ఫాలోవర్లు ఉన్నప్పటికీ ఆయన తన హోదాని దృష్టిలో ఉంచుకొని ట్వీట్ల అంశంలో కాస్త సంయమనమే పాటిస్తున్నారు. కానీ రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధికారిక ట్విటర్‌ ప్రభుత్వాన్ని , ప్రధానిని దుయ్యబడుతూ ట్వీట్లు పెడుతోంది. వాటిల్లో వినియోగించే భాష కూడా విషం వెదజల్లేలా ఉంది. అలా వ్యంగ్యపూరిత, వ్యతిరేకప్రచార ట్వీట్లకే రీట్వీట్లు అధికంగా వస్తున్నాయి. రాహుల్‌ పెట్టే ట్వీట్లకి రీట్వీట్లు వచ్చినంతగా మరే నేతకి రాలేదు. గత ఎన్నికల సమయంలో పప్పూ అన్న నిక్‌నేమ్‌ ఎంతలా నెటిజన్లను ఆకర్షించిందో ఈసారి చౌకీదార్‌ చోర్‌హే (కాపలాదారుడే దొంగ) అని రాహుల్‌ చేసిన అంతకంటే ట్వీట్‌ వైరల్‌ అయింది. ఇక ప్రధాని నరేంద్ర మోదీని ట్విటర్‌ వేదికగా రాహుల్‌ తర్వాత ఢీకొంటున్న నేతల్లో అఖిలేష్‌ యాదవ్, మమతా బెనర్జీ ముందున్నారు. చివరికి ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకొని కొన్ని ట్వీట్లను తొలగించింది కూడా. 

భాష ఘోష
రాజకీయ నాయకులు ట్వీట్లు చేసినప్పుడు ఏ భాష వాడాలి ? ఏ భాషలో పెడితే జనసామాన్యంలోకి చొచ్చుకుపోతుంది ? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కష్టమే. జాతీయ స్థాయిలో అందరికీ అర్థం కావాలంటే ఇంగ్లిష్‌ ముఖ్యం. కానీ స్థానిక భాషలో ట్వీట్‌ చేస్తే అందులో ఉండే మజాయే వేరు. వ్యంగ్యాలు, వెటకారాలు మాతృభాషలో అర్థమైనంతగా, వేరే భాషలో అర్థం కావు. బెంగాలీల ఆత్మగౌరవం అంటూ రెచ్చిపోయే మమతా బెనర్జీ వంటి నేతలు ట్విటర్‌లోకి వచ్చేసరికి దేశవ్యాప్త ఇమేజ్‌ కోసం ఇంగ్లిషు భాషనే ఎంచుకుంటారు. అడపాదడపా ఆమె బెంగాలీలో ట్వీట్‌ చేస్తారు. అఖిలేష్‌ యాదవ్‌ మూడేళ్ల క్రితం వరకు ఇంగ్లిష్‌లోనే ట్వీట్లు చేసేవారు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కువగా హిందీ భాషనే వినియోగిస్తున్నారు. ఆ తర్వాత స్థానం అమిత్‌ షాదే.  

ట్వీట్లు.. ఓట్లు
ట్వీట్లు, రీట్వీట్లు, లైక్‌లు, కామెంట్లు ఇదో డిజిటల్‌ మాయా ప్రపంచం. జనవరి 2019 నుంచి లెక్కలు తీస్తే 4,931 మంది రాజకీయ నాయకులు చేసిన 84 లక్షల ట్వీట్లలో కేంద్రం అవినీతిపై దాడి చేసినవే ఎక్కువ. గత ఎన్నికల్లో తనపై పప్పూ అని బురదజల్లినందుకు రాహుల్‌ ఈసారి చౌకీదార్‌ చోర్‌ హై అంటూ ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక బీజేపీ గత ఎన్నికల్లో రాహుల్‌ని టార్గెట్‌ చేయడంతో పాటు, అభివృద్ది మంత్రం జపించింది. కానీ ఈ ఎన్నికల్లో రూటు మార్చి దేశ భద్రత, సంస్కృతి వంటి అంశాలకే పెద్దపీట వేసింది. మొత్తంగా చూస్తే ఇలా విషం కక్కే ప్రచారం వల్ల అప్పటికప్పుడు పాపులారిటీ వస్తుందే తప్ప ఎన్నికల్లో ఫలితాల్ని సోషల్‌ మీడియా శాసించలేదని విశ్లేషకుల అంచనా. 

‘‘బ్లాక్‌ హోల్‌ ఎక్కడుందో మనకి కనిపించింది. కానీ అచ్ఛేదిన్‌ ఎక్కడున్నాయో మన కంటికి కనిపించడం లేదు‘‘
– అఖిలేశ్‌ యాదవ్, ఎస్పీ అధినేత(కృష్ణబిలం ఫొటోలు మొదటిసారిగా  విడుదల చేసిన సందర్భంలో)

రాహుల్‌గాంధీ వయనాడ్‌ ర్యాలీ ఇండియాలో జరిగిందా ? పాకిస్తాన్‌లో జరిగిందా ? చెప్పడం చాలా కష్టం
– అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు ( ర్యాలీలో మిత్రపక్షం ఐయూఎంఎల్‌ జెండాలు కనిపించిన నేపథ్యంలో)

ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ 
(ఐయూఎంఎల్‌) ఒక గ్రీన్‌ వైరస్‌ – యోగి ఆదిత్యనాథ్, యూపీ ముఖ్యమంత్రి  

మరిన్ని వార్తలు