ఫేస్‌‘బుక్కవుతారు’..!

12 Mar, 2019 09:09 IST|Sakshi

సాక్షి,  శ్రీకాకుళం న్యూకాలనీ: దేశంతో పాటు రాష్ట్రంలో సోషల్‌ మీడియా విస్తరించింది. ఓటర్ల కంటే రెట్టింపు స్మార్ట్‌ఫోన్లు ఉన్నట్లు పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పాటు సాంకేతిక విప్లవం పెరిగిన నేపథ్యంలో ఈ సారి  ఎన్నికల ప్రసారంలో సోషల్‌మీడియా కీలక భూమిక పోషించనుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేసే కంటే కొంతమంది సిబ్బందితో సోషల్‌ మీడియా ద్వారా ఓటర్లను ప్రభావితం చేయగలిగేలా పోస్టింగులు చేసుకుంటే మేలన్న అభిప్రాయాలు లేకపోలేదు. అంతలా సోషల్‌ మీడియా ప్రభావం దేశంలోను, రాష్ట్రంలోను మరీ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉందంటే అతిశయోక్తి కాదు.  

ఇష్టానుసారం పోస్టింగులు కుదరవిక 
ఎన్నికల కోడ్‌ వచ్చేసింది. సామాన్యులతో పాటు ఉద్యోగులు సైతం ఫేస్‌బుక్‌ పేజీలు, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్‌ గ్రూపులలో పోస్టులు పెడుతుంటారు. అయితే సోషల్‌ మీడియాపై ప్రస్తుతం ప్రత్యేక నిఘా ఉంది. తస్మాత్‌ జాగ్రత్త. ఏ పార్టీ అభ్యర్థి కోసం ప్రచారం చేసినా చర్యలు తప్పవు. జిల్లాలో ఉన్న పలు శాఖల అధికారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వివిధ పార్టీలకు పరోక్షంగా సహకరించాలని ప్రయత్నించినా..ప్రత్యర్థి పార్టీలకు చెందిన వ్యక్తులకు సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు, వీడియోలు పెట్టినా ఇక అంతే సంగతులు. పోస్టింగులు ఊస్టింగ్‌ అయిపోతాయి. పోలింగ్‌ ముగిసి, ఓట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుందని ఎన్నికల అధికారులు హెచ్చరిస్తున్నారు. 

ఎన్నికల కోడ్‌లోకి అధికారులు, ఉద్యోగులు 
ఎన్నికల కోడ్‌ రావడంతో ఎక్కడైనా..ఒకేమాట, ఒకే పాట. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎంత మెజారిటీతో గెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు? ఇవే అంశాలపై చర్చలు ప్రారంభమయ్యాయి. పలు గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఒక్కో గ్రూపుల మధ్య వేరు వేరు అభిప్రాయాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వం గురించి పొగడడం గానీ, రాజకీయ పార్టీల గురించి ప్రశంసించడం గానీ అధికారులు చేయకూడదు. ఎన్నికల నియమావళిలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు సైతం ఎన్నికల కోడ్‌లోకి వచ్చేశారు. సామాన్యుల్లాగా ప్రభుత్వ ఉద్యోగులు వారి అభిప్రాయాలను ప్రచారం చేయకూడదు.

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఆదివారం నుంచే ఎన్నికల కోడ్‌ రావడంతో అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పార్టీల ప్రచారంలో గానీ.. సామాజిక మాద్యమాల్లో సొంత అభిప్రాయాలను పోస్టు చేయడం, వీడియోలు పెట్టడం, షేర్‌ చెయ్యడం, చర్చలు సాగించడం వంటివి ఎన్నికల నియమావళికి విరుద్ధం. వార్డు సభ్యుడి నుంచి కౌన్సిలర్, కార్పొరేటర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల వెంట ఉండే అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రచారాలకు వెళ్లడం, వారితోపాటు తిరగడం ఇక వీలుకాదు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే చట్టపరిధిలో కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్నికల అధికారులు, కలెక్టర్‌ జె.నివాస్‌ సైతం ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు