కర్ణాటక బరిలో సాఫ్ట్‌వేర్‌ సీఈవో

3 May, 2018 14:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దర్శన్‌ పుట్టనయ్య 40 ఏళ్ల యువకుడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. అమెరికాలోని డెన్వర్‌లో కేంద్ర కార్యాలయంగా పనిచేస్తున్న ‘క్వినిక్స్‌ టెక్నాలజీస్‌’ కంపెనీలో మొన్నటి వరకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. గత ఫిబ్రవరి నెలలో కర్ణాటక రాజ్య రైత సంఘంలో నాయకుడిగా పనిచేస్తున్న తన తండ్రి కేఎస్‌ పుట్టనయ్య చనిపోవడంతో దర్శన్‌ పుట్టనయ్య తండ్రి అంత్యక్రియలకు వచ్చారు. తండ్రిలాగే తన జీవితాన్ని రైతుల సంక్షేమం కోసం అంకితం చేయాలనుకున్నారు. అందుకోసం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అడుగు పెట్టారు. 2013లో తన తండ్రి పోటీ చేసి విజయం సాధించిన మేలుకోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచే ఎన్నికల బరిలోకి దిగారు.

1990, 2000 దశకాల్లో పలు రైతు ఉద్యమాల్లో పొల్గొన్న కేఎస్‌ పుట్టనయ్య తన రైతు సంఘానికి చెందిన రాజకీయ పక్షమైన సర్వోదయ రాజకీయ పక్ష తరఫున పోటీ చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. అదే సర్వోదయ రాజకీయ పక్ష 2017 సంవత్సరంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు యోగేంద్ర యాదవ్‌ ఏర్పాటు చేసిన స్వరాజ్‌ ఇండియాలో విలీనమైంది. ఈ నేపథ్యంలో దర్శన్‌ పుట్టనయ్య స్వరాజ్‌ ఇండియా పార్టీ తరఫునే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ మేలుకోటే అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదు. అలాగే ఆయనకు మద్దతుగా వీరశైవ లింగాయత్‌లు ఏప్రిల్‌ 28వ తేదీన హులికెరె గ్రామంలో భారీ ర్యాలీని నిర్వహించారు. లింగాయత్‌లను మైనారిటీ మతంగా గుర్తించాలనే తమ డిమాండ్‌కు మద్దతిస్తారా ? అని ర్యాలీలోనే లింగాయత్‌ నాయకులు ప్రశ్నించారు.

నిర్మొహమాటంగా మాట్లాడే దర్శన్‌ పుట్టనయ్య ఆ విషయమై ఈ దశలో తానేమి చెప్పలేనని చెప్పారు. ఈ రోజున కాంగ్రెస్‌ పార్టీ తనకు మద్దతు ఇస్తున్నందున రేపు ఎన్నికల అనంతరం కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి తాను మద్దతిస్తానని భావించరాదని కూడా చెప్పారు. ఏదేమైనా తన జీవితాన్ని మాత్రం తన తండ్రిలాగే రైతుల సంక్షేమం కోసమే అంకితం చేస్తానని పునరుద్ఘాటించారు. అనేక మంది సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలిపెట్టి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న విషయం తెల్సిందే.

మరిన్ని వార్తలు