జగనన్నకు తోడుగా..

26 Sep, 2018 03:40 IST|Sakshi
తిరుపతిలో పాదయాత్ర చేస్తున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

     రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు చేసిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు

     పలుచోట్ల బైక్‌ ర్యాలీలు చేపట్టిన శ్రేణులు

     నవరత్న పథకాల గురించి ప్రజలకు వివరించిన సమన్వయకర్తలు

     చంద్రబాబు దుర్మార్గ పాలనకు చరమగీతం పాడాలని పిలుపు

     జగన్‌ సీఎం అయితేనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని ఉద్ఘాటన  

సాక్షి, నెట్‌వర్క్‌: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర మూడు వేల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా ఆ పార్టీ మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సమన్వయకర్తలు, కార్యకర్తలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ పాదయాత్రలు చేశారు. కార్యకర్తలు, ప్రజలు పలుచోట్ల బైక్‌ ర్యాలీలు, కేక్‌ కటింగ్‌లతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని పలు ప్రాంతాల్లో పూజలు నిర్వహించారు. నేతలు, సమన్వయకర్తలు తమతమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరిగి నవరత్న పథకాల ప్రాముఖ్యతను వివరించారు. జగన్‌ సీఎం అయితేనే ప్రజాసమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేలు కళావతి, కంబాల జోగులు, సీనియర్‌ నేత తమ్మినేని సీతారాం, ఇతర ముఖ్య నేతలు, సమన్వయకర్తలు పాదయాత్రలు నిర్వహించారు. పాదయాత్రగా మూడు వేల కిలోమీటర్ల మైలురాయి దాటడం ద్వారా జగన్‌ రికార్డు సృష్టించారని పార్టీ సీనియర్‌ నేత ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. విజయగనరం జిల్లాలో ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నవరత్న పథకాల గురించి వివరించారు.

విశాఖ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు జగన్‌కు సంఘీభావంగా పాదయాత్రలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలను దుయ్యబట్టారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్రలతో పాటు పలుచోట్ల బైక్‌ ర్యాలీలు నిర్వహించారు. కేకులు కట్‌ చేసి తమ సంతోషం వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా నేతలు, సమన్వయకర్తలు ర్యాలీలు, పాదయాత్రలు చేపట్టారు. ప్రజా సమస్యలు తెలుసుకొని నవరత్నాల కరపత్రాలు పంచిపెట్టారు. కృష్ణా జిల్లాలో పార్టీ నేతలు, కార్యకర్తలు పలుచోట్ల ఆలయాల్లో జగన్‌ సీఎం కావాలంటూ పూజలు నిర్వహించారు. పాదయాత్రలతో పాటు కేక్‌లు కట్‌ చేసి, వైఎస్సార్‌కు నివాళులర్పించి తమ అభిమానం చాటుకున్నారు. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, కోన రఘుపతి, ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నేత అంబటి రాంబాబు తదితరుల ఆధ్వర్యంలో పాదయాత్రలు, బైక్‌ ర్యాలీలు జరిగాయి. ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేశ్, ఇతర నేతల ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.

గడపగడపకూ వెళ్లి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ నాయకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి గొలగమూడిలో శ్రీ వెంకయ్య స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యేలు అనిల్‌ కుమార్‌ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పాదయాత్రలు చేశారు. ఇక కర్నూలు జిల్లాలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, సాయిప్రసాద్‌ రెడ్డి, నేతలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి శిల్పా చక్రపాణిరెడ్డి, హఫీజ్‌ఖాన్‌ నేతృత్వంలో కార్యకర్తలు ప్రజల వద్దకు వెళ్లి చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను వివరించారు. జగన్‌ సీఎం కావాల్సిన ఆవశ్యకతను వివరించారు.

అనంతపురం జిల్లాలో పార్టీ నేతలు భారీ ర్యాలీలు నిర్వహించి ప్రజలకు మిఠాయిలు పంచిపెట్టారు. జగన్‌ అధికారంలోకి వస్తే నవరత్నాలను అమలు చేస్తారని.. వాటి వల్ల ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరుతుందని వివరించారు. చిత్తూరు జిల్లాలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు సంఘీభావంగా ఎమ్మెల్యేలు, నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతిలో యువనేత భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. వైఎస్సార్‌ జిల్లాలో మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు సంఘీభావ పాదయాత్రలతో పాటు పూజలు నిర్వహించారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవరత్నాల కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టారు.

మరిన్ని వార్తలు