కమలం గూటికి సోమారపు

14 Jul, 2019 16:59 IST|Sakshi

సాక్షి, గోదావరిఖని : రామగుండం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే సోమారపు టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఎంపీలు బండి సంజయ్‌, ధర్మపురి ఆరవింద్‌లు ఆదివారం సోమారపు సత్యనారాయణను గోదావరిఖనిలోని ఆయన స్వగృహంలో కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు సోమారపును బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం సోమారపుతో కలిసి బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమారపు మాట్లాడుతూ.. ‘తొలుత ఏ పార్టీలో చేరకూడదని అనుకున్నాను. కానీ టీఆర్‌ఎస్‌ను వీడిన తర్వాత కొందరు నన్ను ఇక్కడి నుంచి వెళ్లగొడతామని వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను ఇక్కడ నుంచి ఎవ్వరు వెళ్లగొట్టలేరు. దేశం మొత్తం కొనియాడేలా ప్రధాన నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన బీజేపీలోకి చేరుతున్నాను. నేను ఎవరిని బలవంతం చేసి బీజేపీలోకి తీసుకెళ్లడం లేదు. బీజేపీలో చేరాక స్థానికంగా పార్టీ అభివృద్ధికి రాత్రి, పగలు తేడా లేకుండా కృషి చేస్తాన’ని తెలిపారు. 

ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన సమయంలో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని సోమారపు తెలిపారు. చెన్నూరు, రామగుండం ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, కోరుకంటి చందర్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో రామగుండంలో తమ వర్గం సత్తా చాటుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. క్షేత్ర స్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది.

మరిన్ని వార్తలు