టీఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత గుడ్‌ బై

9 Jul, 2019 13:03 IST|Sakshi

సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమారపు వెల్లడించారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ పనిచేశారని ఆరోపించారు. తను ఏ పార్టీలో చేరనని.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్‌ ఎన్నికల్లో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకుంటానని అన్నారు. అయితే గత కొంత కాలంగా టీఆర్‌ఎస్‌లో స్థానికంగా నెలకొన్న వర్గపోరు కారణంగానే సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. 

కాగా, సోమారపు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సోమారపుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించింది. అయితే గతేడాది డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మాత్రం సోమారపు సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి కోరుకంటి చందర్‌ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చందర్‌ కేటీఆర్‌ సమక్షంలో తిరిగి టీఆర్‌ఎస్‌లో చేరారు. గతంలో రామగుండం మేయర్‌గా ఉన్న కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం పెట్టడంలో కీలక భూమిక పోషించిన సోమారపు తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో కొంకటి లక్ష్మీనారాయణ మేయర్‌ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అయితే సోమారపు ఓటమికి టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం ప్రధాన కారణమనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

మరిన్ని వార్తలు