రాజంపేట: రీపోలింగ్‌ జరగాలి

12 Apr, 2019 11:46 IST|Sakshi
ఆర్‌ఓకు వినతిపత్రం సమర్పిస్తున్న మేడా మల్లికార్జునరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి

వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి

సాక్షి, రాజంపేట: రాజంపేట మండలం లోని వైబీఎన్‌పల్లె, డీబీఎన్‌పల్లె, శవనవారిపల్లె, కొల్లావారిపల్లె, మిట్టమీదపల్లెలోని 170, 172, 171, 196,199, 192,193 పోలింగ్‌ కేంద్రాల్లో టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగి, తమకు అనుకూలంగా మలుచుకున్నారని, అందువల్ల వాటిలో రీపోలింగ్‌ నిర్వహిం చాలని వైఎస్సార్‌సీపీ అసెంబ్లీ అభ్యర్థి మేడా మల్లికార్జునరెడ్డి విన్నవించారు. పార్టీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డితో కలిసి అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆర్‌ఓ నాగన్నకు వినతిపత్రం అందచేశారు. ఈసందర్భంగా మేడా మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతవరణంలో వినియోగించుకోలేకపోయారంటే ఇందులో పోలీసులు వైఫల్యం ఉందన్నారు.గ్రామాల్లోకి వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు జనరల్‌ ఏజెంటగా వెళితే రాకుండా అడ్డుకోవడం ఎలాంటి సంస్కృతికి దారితీస్తుందన్నారు.

ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాజంపేట చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈ సారి దౌర్జన్యకర వాతవరణంలో పోలింగ్‌ జరగడం విచాకరమన్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారంటే వారిలో ఓడిపోతున్నామనే భయం వెంటాడుతోందన్నారు. తాము కోరుతున్న పోలింగ్‌ కేంద్రాల్లో రీ పోలింగ్‌ జరపాల్సిన ఆవశ్యకత ఉందని, దీనిని ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకోవాలన్నారు. టీడీపీ ఎన్నికుట్రలు చేసినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ రాష్ట్రానికి సీఎం వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కావడం తధ్యమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు పాపినేని విశ్వనాథ్‌రెడ్డి, పోలిమురళీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పోలింగ్‌ సందర్భంగా వచ్చిన పిర్యాదులపై విచారణ చేయడం జరుగుతుందని ఆర్వో నాగన్న ఇక్కడి విలేకరులకు తెలియచేశారు. 

మరిన్ని వార్తలు