‘సీఎం జగన్‌ అద్భుతంగా పనిచేస్తున్నారు’

7 Jul, 2020 13:55 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర పోలీసులపై పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఇంటి ముందు పోలీసులను ఎందుకు పెట్టారని పోలీసులను ఉత్తమ్‌ ప్రశ్నించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ డీసీపీతో ఉత్తమ్‌ ఫోన్‌లో ప్రశ్నించారు. తనను కలవడానికి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గవర్నర్‌ వ్యవస్థను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ అవమానించారన్నారు. సోమేశ్‌ కుమార్‌ సీఎస్‌ పదవికి అనర్హుడని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు. (కొత్త సచివాలయం అవసరమా?)

సోమేశ్‌ ఈ రాష్ట్ర క్యాడర్‌ కాదని, వైద్యశాఖపై సమీక్షకు గవర్నర్‌ పిలిస్తే సీఎస్‌ వెళ్లకపోవడం దారుణమని ఉత్తమ్‌ అన్నారు. ఒక్క మనిషి మూఢ నమ్మకానికి సచివాలయం కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారన్నారు. ఓ వైపు ప్రజలు కరోనా వ్యాధితో కుదేలై పోతుంటే.. మరోవైపు నాయకులు మూఢ నమ్మకాల పేరుతో వేల కోట్లతో కొత్త భవనాలు నిర్మిస్తున్నారని దుయ్యబట్టారు. సచివాలయం మన అందరి ఆస్తి అని, రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన సాగుతోందని విమర్శించారు. 2012-13లో పూర్తయిన భవనాలు ఇప్పుడు కూల్చడం దారుణమని, సచివాలయం కూల్చివేయడంతో ఈ రోజు బ్లాక్‌ డే అని పేర్కొన్నారు. (తెలంగాణ సచివాలయం కూల్చివేత ప్రారంభం)

కరోనా నివారణలో కేసీఆర్ విఫలమయ్యారని ఉత్తమ్‌ కుమార్‌ విమర్శించారు. సచివాలయంలో ఆస్పత్రి పెడితే తప్పేంటని, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు. పక్క రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతంగా పనిచేస్తున్నారని ప్రశంసించారు. ఏపీలో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చారని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులను ఎందుకు నియంత్రించడం లేదని ఉత్తమ్‌ కుమార్‌ సందేహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు