నేను ఇచ్చిన జాబితానే ఫైనల్‌

13 Feb, 2018 11:15 IST|Sakshi

జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించిన మంత్రి సోమిరెడ్డి

రాత పరీక్షల ఫలితాలు పక్కన పెట్టండంటూ హుకుం

పరీక్షలకు హాజరైన టీడీపీ కార్యకర్తలకు కట్టబెట్టేందుకు పావులు

తలలు పట్టుకుంటున్న రెవెన్యూ అధికారులు  

సాక్షి ప్రతినిధి, కడప : జిల్లాలో తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు బరితెగించారు. తమ కార్యకర్తలకే ప్రభుత్వ ఫలాలు దక్కాలంటూ మొండికేస్తున్నారు. తాము చెప్పింది కచ్చితంగా చేసి తీరాల్సిందేనంటూ జిల్లా ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. రేషన్‌ డీలర్ల భర్తీ విషయంలో ఏకంగా తాము రూపొందించిన ఓ జాబితాను ఖరారు చేయాలంటూ సోమవారం మంత్రి సోమిరెడ్డి కడప రెవెన్యూ డివిజన్‌కు చెందిన ఓ అధికారిని ఆదేశించడం చర్చనీయాంశమైంది. మంత్రి ఆదేశించినట్లుగానే ఆ జాబితా ఖరారైతే మాత్రం ఎన్నో ఏళ్లుగా ఉపాధి కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు అన్యాయం జగినట్లే అవుతుంది.

ఇంటర్వ్యూలకూ హాజరు..
కడప రెవెన్యు డివిజన్‌ పరిధిలో ఖాళీగా ఉన్న 275 రేషన్‌ దుకాణాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందుకు సంబంధించి 49 రేషన్‌ షాపులకు దరఖాస్తులు రాలేదు. మిగిలిన వాటికి 864మంది దరఖాస్తు చేయగా, ఈ నెల 10న నిర్వహించిన రాతపరీక్షలకు 725 మంది హాజరయ్యారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి సోమవారం ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. వీరిలో అర్హత సాధించిన వారికి షాపులు కేటాయించాల్సి ఉంది. ఇక్కడ టీడీపీ నేతలు చక్రంతిప్పారు.

రాత్రికిరాత్రే కొత్త జాబితా..
కడప రెవెన్యూ డివిజన్‌లో భర్తీకానున్న రేషన్‌షాపులు తమ కార్యకర్తలకే దక్కాలని నిర్ణయించిన టీడీపీ నేత ఒకరు రాత్రికి రాత్రే కొత్త జాబితాను సిద్ధం చేశారు. కేవలం రాతపరీక్షలకు హాజరవ్వడమే ప్రధాన అర్హతగా చూపించి, టీడీపీ కార్యకర్తలకు ఆయా రేషన్‌షాపులను కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసి.. సోమవారం హడావుడిగా కొత్త జాబితాను మంత్రి సోమిరెడ్డి వద్దకు తీసుకెళ్లి.. ఆ జాబితానే ఖరారు చేయించాల్సిందిగా కోరారు. 

ఇదే ఫైనల్‌..:  రేషన్‌ డీలర్ల రాతపరీక్షల ఫలితాలు పక్కన పెట్టండి. నేను ఇచ్చిన లిస్టే(జాబితా) ఫైనల్‌ చేయండి.. అంటూ మంత్రి సోమిరెడ్డి సాయంత్రం జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారిని ఆదేశించారు. జిల్లా రాతపరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించామని, ఈ సమయంలో జాబితాను మారిస్తే నాకు ఇబ్బందులు వస్తాయని మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. మీ జాబితాను కలెక్టర్‌ ద్వారా ఆమోదముద్ర వేయించాలని కోరినట్లు తెలిసింది. అయితే ఇందుకు ససేమిరా అన్న మంత్రి.. నేను చెప్పింది చేయండి.. ఆ జాబితానే ఖరారు చేయండంటూ హుకుం జారీ చేయడంతో ఏమి చేయాలో తేల్చుకోలేక ఆయన సతమతమవుతున్నట్లు తెలిసింది.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు