సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ముఖ్యమంత్రిని కలిశా..

11 Nov, 2019 18:34 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు సోమవారం కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ...‘సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ముఖ్యమంత్రిని స్వయంగా కలిశాను. రాజధాని నిపుణుల కమిటీకి కొన్ని సలహాలు ఇచ్చాను. ఆ సలహాలనే సీఎంకు వివరించా. రాజధానిపై చంద్రబాబు నాయుడు హైప్‌ క్రియేట్‌ చేశారు. రూ.7వేల కోట్లు రాజధాని కోసం ఖర్చు చేశామంటున్నారు. ఆ ఏడువేల కోట్లు పెట్టి ఏమి కట్టారో విచారణ జరపాలి. విడిపోయిన రాష్ట్రం రాజధాని కట్టుకోవడం సహజం. అభివృద్ధి అనేది వికేంద్రీకరణ జరగాలి. 

తెలుగుతో పాటు ఇంగ్లీష్‌ కూడా అవసరం
ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం పెట్టడం మంచిదే. 42శాతం మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ప్రయివేట్‌ స్కూళ్లలో 58శాతం ఇంగ్లీష్‌ మీడియం చదువుతున్నారు. పోటీ పరీక్షలకు ఇంగ్లీష్‌ ఎంతో ఉపయోగపడుతుంది. తెలుగు ఎంత ముఖ్యమో ఇంగ్లీష్‌ కూడా అంతే ముఖ్యం. మా పిల్లలు కూడా ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నారు. విద్య, వైద్యంలో అనాదిగా అవినీతి జరుగుతోంది. పోలవరం కంటే విద్యా, వైద్యంలో అవినీతి ఎక్కువగా జరిగింది. దీనిపైనా విచారణ జరిపించాలని సీఎంను కోరాను’ అని అన్నారు.

చదవండి: అదే మనం వారికిచ్చే ఆస్తి: సీఎం జగన్‌

మరిన్ని వార్తలు