అవినీతికి పాల్పడుతూ.. ధర్మ పోరాటమా?

18 Jun, 2018 14:15 IST|Sakshi
ఎమ్మెల్సీ సోము వీర్రాజు

చంద్రబాబుపై ఎమ్మెల్సీ సోము వీర్రాజు ధ్వజం

సాక్షి, ప్రొద్దుటూరు : రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మండిపడ్డారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతూ.. ధర్మపోరాటం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీరు చెట్టు, హౌసింగ్‌ ఫర్‌ అల్‌ పథకాల్లో చంద్రబాబు 30 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై నిపుణులతో విచారణ చేపట్టి ఆయనపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు, పట్టణాలకు కేంద్రం నిధులు అందజేస్తున్నా.. చంద్రబాబు కేంద్రం గురించి మాట్లాడటం లేదన్నారు. 

కడప ఉక్కు పరిశ్రమపై టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ ఆమరణ దీక్ష చేపట్టడం సిగ్గుచేటని సోము వీర్రాజు విమర్శించారు. జిల్లాలో చక్కెర ప్యాక్టరీ, రమేశ్‌ ఇంటి సమీపంలోని పాలకేంద్రం గురించి ఏ రోజైనా ప్రస్తావించాడా అంటూ విరుచుకుపడ్డారు. రాయలసీమ నికర జలాల గురించి పోరాడితే బాగుంటుందని సూచించారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని బీజేపీ పోరాటం చేస్తుందని తెలిపారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు బీజేపీ బాధ్యతని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు