ఆ లేఖలు ఇచ్చింది చంద్రబాబే : సోము వీర్రాజు

12 Mar, 2018 13:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ విభజన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెండుసార్లు లేఖలు ఇచ్చారని బీజేపీ సీనియర్‌ నేత సోము వీర్రాజు అన్నారు. ఏపీ అసెంబ్లీ మండలిలో ఆయన మాట్లాడుతూ సీపీఎం మినహా అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్‌ విభజనకు అంగీకరించాయని చెప్పారు. అంతా సమన్యాయం అన్నారే తప్ప ఏ ఒక్కరూ ఏపీకి ఏం కావాలనే విషయాన్ని అడగలేదని అన్నారు. విభజన సమయంలో ఏపీ గురించి పార్లమెంటులో మాట్లాడిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమే అని స్పష్టం చేశారు.

టీడీపీ ఏపీలో సమైక్య ఉద్యమం, తెలంగాణలో విభజన ఉద్యమం చేసిందన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ 1200 హామీలు చేసిందని, అందులో ఏ ఒక్క హామీని కూడా టీడీపీ నెరవేర్చలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ఒక్క హామీని కూడా నెరవేర్చకుండానే కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. విభజన చట్టంలోని హామీలు పదేళ్లలో అమలు చేయాలని ఉంటే తాము మాత్రం మూడేళ్లలోనే చాలా వరకు అమలు చేశామని చెప్పారు. బీజేపీని నిందిస్తే ఏపీకి మంచి జరగదని, రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. 

మరిన్ని వార్తలు