17 తర్వాత పరిస్థితి ఏంటి: సోనియా

7 May, 2020 08:53 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనాకు లాక్‌డౌన్‌ పరిష్కారమని భావించిన ప్రభుత్వం ఈ స్థితిని ఎంతకాలం కొనసాగిస్తుందో చెప్పాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రశ్నించారు. ‘మే 17 అనంతరం పరిస్థితి ఏమిటి?’ అని కాంగ్రెస్‌ పాలిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిపిన సమావేశంలో సోనియా ప్రశ్నించారు. లాక్‌డౌన్‌ని ఎంతకాలం పొడిగిస్తారు? ప్రభుత్వం వద్ద లాక్‌డౌన్‌ అనంతర ప్రణాళిక ఏమిటని సోనియా ప్రశ్నించినట్టు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా వెల్లడించారు. ఇంత క్లిష్టకాలంలో సైతం అత్యధిక గోధుమపంటను అందించడం ద్వారా ఆహార భద్రతకు కృషిచేసిన రైతాంగానికి ప్రధానంగా పంజాబ్, హరియాణా రైతులకు సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలియజేశారు.

వలస కార్మికుల సమస్యను కూడా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆమె చర్చించారు. ప్రత్యేక రైళ్లలో వలస కార్మికుల నుంచి టిక్కెట్‌ ఛార్జీలు కేంద్రం వసూలు చేస్తుండటాన్ని ఇప్పటికే సోనియా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వలస కార్మికులను తరలించడానికి అయ్యే ఖర్చును కాంగ్రెస్ పార్టీ భరిస్తుందని అంతకుముందు ఆమె ప్రకటించారు. ఈ భేటీలో రాహుల్ గాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్‌డౌన్‌న కేంద్ర ప్రభుత్వం మే 17 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. (త్వరలో ప్రజా రవాణాకు పచ్చజెండా)

మరిన్ని వార్తలు