కాంగ్రెస్ తెర వెనుక శక్తి

9 Mar, 2019 20:25 IST|Sakshi

సోనియా గాంధీ

సాక్షి వెబ్ ప్రత్యేకం : కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. అసలు పేరు సోనియా మైనో. ఆమె 1946, డిసెంబర్‌ 9వ తేదీన ఇటలీలోని టూరిన్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఒర్బసానో గ్రామంలో సంప్రదాయ రోమన్‌ క్యాథలిక్‌ కుటుంబంలో జన్మించారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో ఇంగ్లీషు, ఫ్రెంచ్, రష్యన్‌ భాషలను అభ్యసించారు. ఇంగ్లీషు భాషను అధ్యయనం చేస్తున్నప్పుడే ఆమెకు రాహుల్‌ గాంధీ పరిచయం అయ్యారు. వారిద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. 1968, ఫిబ్రవరి 25వ తేదీన ఢిల్లీలో వసంత పంచమి రోజున పెళ్లి చేసుకున్నారు. రాజీవ్‌ గాంధీ తల్లి ఇందిరాగాంధీ–ఫిరోజ్‌ గాంధీని కూడా అదే రోజు చేసుకున్నారు. రాజీవ్‌ గాంధీ మరణానంతరం అనివార్య కారణాల వల్ల ఆలస్యంగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన సోనియా గాంధీ ‘నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌’ చైర్మన్‌గా యూపీఏ ప్రభుత్వాన్ని నడిపించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులుగా పార్టీకి దశ దిశ నిర్దేశించారు. 

ఆమె ‘రాజీవ్‌’, ‘రాజీవ్స్‌ వరల్డ్‌’ రెండు పుస్తకాలను రచించారు. 1922 నుంచి 1964 మధ్య పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ, ఇందిరా గాంధీల మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలను ‘ఫ్రీడమ్స్‌ డాటర్‌’, ‘టు ఎలోన్, టు టుగెదర్‌’ అనే రెండు సంపుటాలను ఎడిట్‌ చేసి ప్రచురించారు. ఆమెకు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లతో ఇద్దరు పిల్లలున్న విషయం తెల్సిందే. 

తొలిచూపులోనే ప్రేమలో
సోనియా గాంధీ 1965లో కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీలో అడుగు పెట్టారు. అప్పటికి మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చదువుతున్న రాజీవ్‌ గాంధీ ఆమెకు అనుకోకుండా తారసపడ్డారట. తొలిచూపులోనే వారు ప్రేమించుకున్నారట. అలా వారి ప్రేమాయణం మూడేళ్లపాటు సాగింది. రాజీవ్‌ గాంధీ హిందూ మతానికి చెందిన వారే కాకుండా పలుకుబడి, అధికారంగల రాజకీయ కుటుంబానికి చెందిన వారవడం వల్ల ముందుగా సోనియా కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అసలు ఒప్పుకోలేదట. అంతకన్నా పెళ్లి ప్రతిపాదనను ఇందిరా గాంధీ వరకు తీసుకెళ్లాలంటే సోనియా కుటుంబ సభ్యులు భయపడి చచ్చారట. రాజీవ్‌ గాంధీ అన్నింటికి ధైర్యంగా నిలబడి తల్లిని ఒప్పించి పెళ్లి చేసుకున్నారట. పెళ్లి రోజు అత్తగారు ఇందిరాగాంధీ ఇచ్చిన ఆమె పెళ్లి నాటి గులాబీ రంగు చీరనే సోనియా గాంధీ ధరించారట. 

రాజీవ్‌ గాంధీ మరణానంతరం
1984–1991 (కొద్ది కాలం లోక్‌సభ నాయకుడిగా) మధ్య రాజీవ్‌ గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెంట సోనియా గాంధీ దేశ, విదేశాలు తిరిగారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లోని అమేథి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిన పనులు చూసుకునేవారు. ఆరోగ్య శిబిరాలు, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేవారు. రాజీవ్‌ హత్యానంతరం ఆమె రాజీవ్‌ గాంధీ పేరిట ఓ స్వచ్ఛందంగా ఓ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ‘రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాంటెంపరరీ స్టడీస్‌’కు చైర్‌పర్సన్‌గా, పలు స్వచ్ఛంద సంస్థలకు హెడ్‌గా బిజీ బిజీగా గడిపారు. 

రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఒత్తిడి
1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు కొంతకాలం ముందు నుంచి ప్రత్యక్ష క్రియాశీలక రాజకీయాల్లోకి రావాల్సిందిగా ఆమెపై ఒత్తిడి వచ్చింది. 1998, ఏప్రిల్‌లో పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1999లో అమేథి నుంచి పోటీచేసి మొదటి సారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి సంపూర్ణ మెజారిటీ రాకపోయినప్పటికీ అత్యధిక సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌ పార్టీ ఆమెనే తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. ఆమెనే ప్రధాన మంత్రి అవుతారని అనుకున్నారు. ఇటలీలో జన్మించి, అక్కడి పౌరసత్వాన్ని కలిగిన సోనియాకు ఆ అర్హత లేదంటూ బీజేపీ, దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున వివాదం లేవదీయడంతో ఆమె అనూహ్యంగా ప్రధాని పదవికి మన్మోహన్‌ సింగ్‌ పేరును ప్రతిపాదించారు. యూపీఏ సంకీర్ణ కూటమి చైర్మన్‌గా, పార్లమెంట్‌లో పార్టీ నాయకురాలిగా ఆమె తన సేవలందించారు. 

ముఖ్యమైన విధాన నిర్ణయాలు 
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కనీసం వంద రోజులపాటు ఉపాధి కల్పించడం కోసం సోనియా గాంధీ ‘మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాథి గ్యారంటీ చట్టం’ను 2005లో తీసుకొచ్చారు. ఈ పథకాన్ని 2006 నుంచి అమలు చేశారు. ప్రభుత్వ పాలనలో అవినీతిని అరికట్టేందుకు 2009లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. 2004 నుంచి 2014 వరకు నేషనల్‌ అడ్వైజరీ కౌన్సిల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేశారు. ‘రాజీవ్‌ గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాంటెంపరరీ స్టడీస్‌’ చైర్‌పర్సన్‌గా ఉన్నప్పుడే సోనియా గాంధీ, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ద్వారా దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకరావడానికి కషి చేశారని రాజకీయ పరిశీలకులు చెబుతారు. 

ఆసక్తికరమైన అంశాలు

  • సోనియా గాంధీ పాఠశాల రోజుల్లో మంచి ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. పెళ్లికి ముందు వెల్లింఘ్టన్‌ క్రిసెంట్‌ హౌజ్‌లో బచ్చన్‌ కుటుంబంతో కొద్దికాలం కలిసి ఉన్నారు. 
  • 1968, జనవరి 26వ రోజు, దేశ రిపబ్లిక్‌ దినోత్సవం నాడు రాజీవ్‌ గాంధీతో సోనియాకు నిశ్చితార్థం జరిగింది. 
  •  ఆమె మెహంది పండుగ కూడా బచ్చన్ల ఇంటిలోనే జరిగింది. 
  •  పెళ్లి నాటికి సోనియాకు హిందీ రాదు. ఇంట్లో హిందీ టీచర్‌ను పెట్టుకొని హిందీ నేర్చుకొని, ఆ తర్వాత ఇనిస్టిట్యూట్‌కు వెళ్లి నేర్చుకున్నారు. 
  • భారతీయ చేనేత, చేతి వత్తుల అధ్యయనంపై ఆసక్తి. జానపద, శాస్త్రీయ సంగీతాలను ఇష్టపడతారు. ఢిల్లీ నేషనల్‌ మ్యూజియంలో ఆయిల్‌ పెయింటింగ్స్‌ను ఎలా సంరక్షించాలన్న అంశంపై డిప్లమో చేశారు.
    - వి. నరేందర్‌ రెడ్డి
మరిన్ని వార్తలు