డిగ్గీ రాజా Vs సింధియా.. రంగంలోకి సోనియా

8 Sep, 2019 11:02 IST|Sakshi

మధ్యప్రదేశ్‌ సీఎంతో భేటీ.. పార్టీలోని కుమ్ములాటలపై ఆందోళన

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో ఆ పార్టీ తాత్కాలిక జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీ తాజాగా మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర యూనిట్‌లో తలెత్తిన అంతర్గత కుమ్ములాటలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. అయితే, పార్టీ సీనియర్‌ నేతలైన జ్యోతిరాదిత్య సింధియా, దిగ్విజయ్‌ సింగ్‌ మధ్య ప్రస్తుతం విభేదాలు తారస్థాయికి చేరిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వ ‍వ్యవహారాల్లో దిగ్విజయ్‌ జోక్యం పెరిగిపోయిందని ఇటీవల మధ్యప్రదేశ్‌ అటవీశాఖ మంత్రి ఉమంగ్‌ సింగార్‌ వ్యాఖ్యలు చేయగా.. ఆ వ్యాఖ్యలను సింధియా బాహాటంగా సమర్థించారు. దీనికి దిగ్విజయ్‌ ఘాటుగా స్పందిస్తూ.. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎంతటి వారిపైనైన చర్యలు తీసుకోవాల్సిందేనని సింధియాను ఉద్దేశించి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సోనియా కమల్‌నాథ్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతం వారం రోజుల్లో వీరు రెండోసారి భేటీ కావడం గమనార్హం. రాష్ట్ర పీసీసీలో ప్రస్తుతం నెలకొన్న విభేదాలు, క్రమశిక్షణ రాహిత్యంపై సోనియా ఆందోళన వ్యక్తం చేసినట్టు కమల్‌నాథ్‌ ఈ భేటీ అనంతరం మీడియాకు తెలిపారు. పార్టీలోని విభేదాలను రూపుమాపి.. తిరిగి పార్టీని గాడిలో పెట్టేందుకు సోనియా అంతర్గతంగా చర్యలు తీసుకుంటున్నారని, అందులో భాగంగానే ఆమె మధ్యప్రదేశ్‌ సీఎంతో భేటీ అయ్యారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

 

మరిన్ని వార్తలు