వారికి ఎన్నటికీ అర్థం కాదు: సోనియా గాంధీ

2 Oct, 2019 15:25 IST|Sakshi

న్యూఢిల్లీ : కుట్రపూరిత రాజకీయాలు చేసే వారు మహాత్మా గాంధీ సిద్ధాంతాలైన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. భారత జాతిపిత మహత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్‌ఘాట్‌ వద్ద సోనియా బాపూజీకి నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... గత ఐదేళ్లుగా దేశంలో చోటుచేసుకుంటున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతగానో క్షోభించి ఉంటుందని మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. తమను తాము గొప్పవాళ్లుగా భావించుకునే వ్యక్తులు.. దేశం కోసం గాంధీజీ చేసిన త్యాగాలను ఏనాటికీ అర్థంచేసుకోలేరని విమర్శించారు. ‘ఇండియా, గాంధీ పర్యాయపదాలు. అయితే కొంతమంది మాత్రం ఆరెస్సెస్‌, భారత్‌ పర్యాయపదాలు అని ప్రచారం చేసే పనిలో పడ్డారు. నయవంచక రాజకీయాలు చేస్తున్నారు. శాంతి, అహింస అన్న మాటలు వాళ్లకు ఎన్నటికీ అర్థం కావు అని బీజేపీ మాతృ సంస్థ ఆరెస్సెస్‌పై సోనియా విమర్శల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా గాంధీ సిద్ధాంతాలను, ఆదర్శాలను ప్రతీ ఒక్క కాంగ్రెస్‌ కార్యకర్త ఆచరించాలని సోనియా విఙ్ఞప్తి చేశారు. 

కాగా కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా సోనియాతో పాటు రాజ్‌ఘాట్‌ను సందర్శించారు. ఆమె మాట్లాడుతూ..‘ సత్యనిష్ఠతో ఉండమని.. సత్యమార్గంలో నడవాలని మహాత్మా గాంధీ బోధించారు. బీజేపీ కూడా బాపూ చెప్పిన బాటలో నడవాల్సిన ఆవశ్యకత ఉంది అని పేర్కొన్నారు. ఇక గాంధీ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ.. రాహుల్‌ గాంధీ ఆధ్వర్యంలో ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో లక్నోలో నిర్వహించనున్న పాదయాత్రలో ప్రియాంక గాంధీ పాల్గొననున్నారు.

మరిన్ని వార్తలు