సోనియా పర్యటన రద్దు 

7 Apr, 2019 15:29 IST|Sakshi

కాంగ్రెస్‌ నేతల ఆశలు ఆవిరి 

అనారోగ్య సమస్యతో సభకు రాలేకపోతున్న యూపీఏ చైర్‌పర్సన్‌ 

పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నైరాశ్యం 

మీర్జాపూర్‌ వద్ద ఏర్పాట్లు పూర్తి 

సచిన్‌ పైలట్, ఆజాద్, విజయశాంతి, చిరంజీవి రాక 

యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీని ఎన్నికల ప్రచారానికి తీసుకువచ్చి లబ్ధిపొందాలనుకున్న కాంగ్రెస్‌ ఆశలు ఆవిరయ్యాయి. ముందస్తు షెడ్యూల్‌ ప్రకారం పూడురు మండలంలోని మీర్జాపూర్‌లో ఆదివారం నిర్వహించ తలపెట్టిన బహిరంగ సభకు ఆమె హాజరు కావాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆరోగ్యం సహకరించని కారణంగా సోనియా తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్‌ నేతల ఆశలు ఆవిరయ్యాయి.

 జిల్లాలో కాంగ్రెస్‌కు ప్రచారానికి ఎదురు దెబ్బ తగిలింది. సోనియాగాంధీ పర్యటన రద్దయింది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో ఇప్పటి వరకు ఆ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరూ రాలేదు. ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఒక్కరే స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు టీఆర్‌ఎస్‌ కేటీఆర్‌ రోడ్‌షోలు నిర్వహించటంతోపాటు కేసీఆర్‌ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. ప్రచారంలో గులాబీ నేతలు దూసుకుపోతుంటే హస్తం శ్రేణులు కొంత వెనకబడ్డాయి. దీన్ని అధిగమించేందుకు లక్ష మందితో సోనియాసభ నిర్వహించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపాలని కొండా భావించారు.

ఈ మేరకు మిర్జాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు భారీ జన సమీకరణ కోసం సర్వం సిద్ధం చేశారు. అనుకోకుండా సోనియా పర్యటన రద్దు కావడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆమె వస్తే చేవెళ్ల పార్లమెంట్‌ స్థానంలో విజయావకాశాలు మెరుగయ్యేవని చెబుతున్నారు. సోనియ రాకపోవటం ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని పలువురు నాయకులు అభిప్రాయపడ్డారు. ఆమె పర్యటన రద్దు కావడంతో కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.  

 జాతీయ నాయకుల రాక.. 

సోనియా పర్యటన రద్దు కావడంతో కాంగ్రెస్‌ నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా పలువురు జాతీయ నాయకులను ఆహ్వానించారు. రాజస్థాన్‌ ఉప ముఖ్యమంత్రి సచిన్‌ పైలెట్, గులాంనబీ ఆజాద్, జ్యోతిరాధిత్య సింథియా, ప్రతిపక్షనేత భట్టి విక్రమార్క, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతి, సినీనటుడు చిరంజీవి తదితరులు హాజరై ప్రసంగించనున్నారు. సాయంత్రం 4గంటలకు సభ ప్రారంభమవుతుంది. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి కార్యకర్తలు, ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష మందితో బహిరంగసభ నిర్వహించాలని కాంగ్రెస్‌ నాయకులు టార్గెట్‌గా పెట్టుకున్నారు. మీటింగ్‌ సందర్భంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. ఇందుకు అవసరమైన భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సభను విజయవంతం చేస్తాం... 

చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి గెలుపు ఖాయమని, ప్రజలు ఆయన వెన్నంటే ఉన్నారని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ అన్నారు. సోనియా పర్యటపై ఆయన మాట్లాడుతూ.. అనివార్య కారణాల వల్ల యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మిర్జాపూర్‌లో లక్షమందితో యథావిధిగా బహిరంగసభ జరుగుతుందన్నారు. దీనికి సచిన్‌ పైలెట్, ఆజాద్, విజయశాంతి తదితరులు హాజరుకానున్నట్లు చెప్పారు.     

మరిన్ని వార్తలు