రాజకీయాలకు సోనియా గుడ్ బై!

15 Dec, 2017 12:31 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ(47) పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు చేసిన నేపథ్యంలో ఆయన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో  రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు కాంగ్రెస్ అధినేత్రి సోనియా సంకేతాలిచ్చారు. రాజకీయాల్లో తన పాత్ర ముగిసినట్లేనని తాజాగా మీడియాతో మాట్లాడుతూ సోనియా స్వయంగా వ్యాఖ్యానించారు. 19 ఏళ్ల పాటు ఏఐసీసీ అధ్యక్షురాలిగా సోనియా బాధ్యతలు నిర్వర్తించారు. సోనియా నేతృత్వంలో రెండుసార్లు యూపీఏ కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కుమారుడికి బాధ్యతలు అప్పగించిన అనంతరం ఆమె భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నదానిపై ఇటీవల తలెత్తిన సందేహాలపై సోనియా తాజా వ్యాఖ్యలతో తెరపడినట్లయింది.

రాహుల్ గాంధీ రేపు (శనివారం) అధికారికంగా పార్టీ పగ్గాలు చేపట్టనుండగా.. పార్టీ శ్రేణులు అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. 16వ తేదీన ఉదయం 11 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌ నియామక ఉత్తర్వులు అందుకుంటారని కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్‌ ఎం.రామచంద్రన్‌ ఇటీవల తెలిపారు. రాహుల్ పట్టాభిషేకానికి సోనియాగాంధీ సహా అన్ని రాష్ట్రాల నుంచి పార్టీ ప్రముఖులు హాజరు కానున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు రాహుల్‌కు అనుకూలంగా వచ్చాయి. రాహుల్‌ ఒక్క నామినేషన్‌ మాత్రమే ఉండటంతో అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, గుజరాత్, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల ఫలితాల వెల్లడికి రెండు రోజులు ముందుగా రాహుల్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనుండటం విశేషం.

Poll
Loading...
మరిన్ని వార్తలు