నాతో రండి.. బీజేపీని దింపేద్దాం : సోనియా

11 Mar, 2018 20:11 IST|Sakshi

ఈ నెల 13న ఎన్డీయేతర పార్టీ నాయకులకు విందు

సాక్షి, న్యూఢిల్లీ : వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీని గద్దె దింపాలనే లక్ష్యంతో కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇందుకుగాను బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటిని ఒకే తాటిపైకి తెచ్చి యునైటెడ్‌ ఫ్రంట్‌గా ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే తమతో కలిసి రావాలని తమిళనాడు డీఎంకే పార్టీ నేత స్టాలిన్‌ను కోరిన సోనియా ఆ మేరకు తాజాగా ఆమె ఇవ్వనున్న విందుకు ఆహ్వానించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యునైటెడ్‌ ఫ్రంట్‌గా ఏర్పడి ఎన్డీయేని ఎదుర్కొనేందుకు తమతో కలిసి రావాలని సోనియా గత నెలలో అన్ని ప్రతిపక్ష పార్టీలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 13న ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేయడమే ఈ విందు లక్ష్యం అని తెలుస్తోంది.

అయితే మార్చి 15 నుంచి తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండడంతో స్టాలిన్‌ ఈ విందుకు హాజరు కాబోరని, పార్టీ తరుపున కనిమొళి వస్తారని డీఎంకే మరోనేత టీకేఎస్‌ ఇలంగోవన్‌ తెలిపారు. బీజేపీని ఓడించడానికి అవసరమైన సలహాలు, సూచనలు సోనియా ప్రతిపక్ష నాయలకుల నుంచి ఈ విందులో స్వీకరించనున్నారు. కార్యక్రమంలో బిహార్‌ నుంచి ఆర్జేడీ నాయకులు, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌, హిందుస్తానీ ఎవమ్‌ మోర్చా-సెక్యులర్‌ (హెచ్‌ఏఎం-ఎస్‌) అధిపతి జీతన్‌రామ్‌ మాంఝీ పాల్గొననున్నారు. తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాణా కుంభకోణంలో జైలు పాలు కావడంతో ఆర్జేడీ బాధ్యతలు తేజస్వీ యాదవ్‌ చూస్తున్నారు. బిహార్‌లో రెండు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించేందుకు కాంగ్రెస్‌, ఆర్జేడీ, హెచ్‌ఏఎం-ఎస్‌లు మహా కూటమిగా ఏర్పడుతున్నట్లు ప్రకటించాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ పని తీరుపై, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో జరిగిన 12,600 కోట్ల రూపాయల కుంభకోణంపై ఈ సందర్భంగా చర్చించనున్నారు.

మరిన్ని వార్తలు