వారసురాలు వస్తోంది

16 Mar, 2018 07:03 IST|Sakshi

రజనీ కుమార్తె సౌందర్య రంగప్రవేశం?

మామకు తోడుగా అల్లుడు ధనుష్‌

రాజకీయ నాయకుడిగా కూడా విజయం సాధిస్తా: రజనీ

వ్యాపారం, వాణిజ్యం, రాజకీయం, సినీరంగం... ప్రస్తుతం అన్నిచోట్లా వారసత్వం ఆనవాయితీగా మారింది. అదే కోవలో ప్రముఖ నటులు రజనీకాంత్‌ సైతం కొత్తగా పెట్టబోయే రాజకీయపార్టీలో ఆయన చిన్న కుమార్తె సౌందర్యను వారసురాలిగా రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. అలాగే రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య భర్త, నటుడు ధనుష్‌ సైతం మామకు తోడుగా నిలుస్తారని తెలుస్తోంది. దీన్ని ధృవీకరిస్తూ మధురైలో ధనుష్‌ అభిమానుల పేరుతో ‘అరసియల్‌ వారిసే’ (రాజకీయ వారసుడా) గురువారం పోస్టర్లు కూడా వెలిశాయి.

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆకస్మిక మరణం రాష్ట్రంలో అతిపెద్ద రాజకీయ శూన్యతకు దారి తీసింది. ఈ శూన్యాన్ని భర్తీ చేసేందుకు నటుడు కమల్‌హాసన్‌ ‘మక్కల్‌ నీది మయ్యం’ అనే పార్టీని స్థాపించేశారు. అన్నాడీఎంకే బహిష్కృత నే టీటీవీ దినకరన్‌ సైతం ‘అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం’ అనే పార్టీని గురువారం ప్రకటించారు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని జనవరి ఆరంభంలో రజనీకాంత్‌ ప్రకటించారు. రెండు కోట్ల సభ్యత్వం లక్ష్యంగా పనులు ప్రారంభించారు. రజనీకాంత్‌ ప్రజా సంఘాలకు ఇన్‌చార్జ్‌ల నియామకం దాదాపు పూర్తయింది. పార్టీ పేరును ప్రకటించడం మినహా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్న దశలో రజనీ హిమాలయాలకు ఆధ్యాత్మిక పర్యటనకు పయనమయ్యారు.

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వెండితెర వారసురాలిగా చిన్న కుమార్తె సౌందర్య స్వీయ దర్శకత్వంలో కొచ్చడయన్‌ అనే యానిమేషన్‌ సినిమాను నిర్మించారు. ఆ సినిమా ఘోరపరాజయం పొంది రజనీ కుటుంబాన్ని అప్పులపాలు చేసిన తరువాత కూడా సినిమారంగంలోనే కొనసాగడంలో వెనకడుగు వేయలేదు. వెండితెర వెనుక తండ్రికి అండగా నిలిచిన ఆమె రాజకీయాల్లో సైతం తోడుగా నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య కూడా తన భర్త, నటుడు ధనుష్‌ను తండ్రికి తోడుగా రాజకీయాల్లోకి సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వెలువడ్డాయి. కొందరు ధనుష్‌ అభిమానులు మధురైలో పోస్టర్లు కూడా వేసేశారు. ధనుష్‌ను రజనీకాంత్‌ ఆశీర్వదిస్తున్నట్లు ఉన్న ఫొటోలతో ‘అరసియల్‌ వారిసే’ (రాజకీయ వారసుడా) అని పోస్టర్లలో నినాదాన్ని రాశారు. కోలీవుడ్‌లో ధనుష్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉంది. పెద్ద ఎత్తున యువత అభిమానాన్ని ఆయన చూరగొన్నాడు. రజనీకాంత్‌ రాజకీయాలకు ధనుష్‌ తోడైతే రాజకీయ పార్టీకి మరింత ఊపు ఖాయమని అంచనా వేస్తున్నారు.

హిమాలయాల్లోనూ సాధ్యం కాదు 
సాధారణ వ్యక్తిలా తిరిగేందుకు హిమాలయాలకు వచ్చే నేను ఇకపై ఇక్కడ కూడా అలా తిరగడం సాధ్యం కాదని తెలుసుకున్నట్లు నటులు రజనీకాంత్‌ చెప్పారు. రిషికేష్‌లోని ధ్యానానంద సరస్వతి ఆశ్రమంలో బుధవారం సాయంత్రం ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం అక్కడి ఇంగ్లీషు చానల్‌ ప్రతినిధితో రజనీకాంత్‌ మాట్లాడారు. ఒక మనిషి తనను తాను తెలుసుకోవడంలోనే జన్మసార్ధకత చేకూరుతుందన్నారు. అందుకే హిమాలయాలకు వచ్చానని, «ధ్యానం చేయడం, ఆధ్యాత్మికపరమైన పుస్తకాలు చదవడం, ఎలాంటి కట్టుబాట్లు లేకుండా ప్రజలతో కలిసి సంచరించడం కోసమే ఇలాంటి ప్రయాణాలు చేస్తుంటానన్నారు. రాజకీయ పార్టీల నేతలు, సినిమా రంగంలోని వారు నాకు ఇక్కడ అవసరం లేదని, ఇక్కడి ప్రజలు, ప్రకృతి మాత్రమే నాకు చాలునన్నారు.

తమిళనాడులో ఇలా సంచరించడం సాధ్యం కాదని, ప్రజల్లో సా«ధారణ వ్యక్తిలా తిరిగే అవకాశాలను ఏనాడో కోల్పోయానని తెలిపారు. ఆ లోటును భర్తీ చేసుకునేందుకే 1995 నుంచీ హిమాలయాలకు వస్తూ స్వేచ్ఛగా తిరిగేవాడినని పేర్కొన్నారు. అయితే రాజకీయాల్లోకి రావడంతో ఇక్కడ కూడా తిరిగే అవకాశాలు లేవన్నారు. రాజకీయాల్లోకి వచ్చినవారు త్యాగాలకు సిద్ధం కావాలని, తాను సైతం అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఆ దేవుడు నటుడిగా  ఇచ్చిన పాత్రను సరిగా పోషించానని, ఇక రాజకీయ నాయకుడిగా కొత్తపాత్రకు నూరుశాతం న్యాయం చేయగలనని నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారని, త్యాగాలు చేయడం ద్వారా  వాటిని నెరవేర్చేందుకు సిద్ధమన్నారు.  

మరిన్ని వార్తలు