కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ..

6 Jul, 2018 16:41 IST|Sakshi
బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ పావులు కదుపుతోంది. మాజీ సీఎం, పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ తీరును జీర్ణించుకోలేని కొందరు ఎమ్మెల్యేలు పార్టీని వీడేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీడీపీ రెబెల్‌ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సాయంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అమర్‌నాథ్‌ యాత్ర ముగిసిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసి, గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా స్థానంలో మరొకరిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కాగా కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు పెరగటం, శాంతి భద్రతలు కాపాడటంలోముఫ్తీ సర్కార్‌ విఫలం కావడం వంటి అంశాలను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మెహబూబా ముఫ్తీ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొత్తం 89 మంది సభ్యులున్న జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో బీజేపీకి 25 మంది ఎమ్మెల్యేలు, పీడీపీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉండగా, మ్యాజిక్‌ ఫిగర్‌కు కావాల్సిన సభ్యుల సంఖ్య 45. అనూహ్య రాజకీయ పరిణామాల మధ్య కశ్మీర్‌లో గవర్నర్‌ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో.. గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోహ్రా అసెంబ్లీని పూర్తిగా రద్దు చేయకుండా సుప్తచేతనావస్థలో ఉంచారు. ఈ నేపథ్యంలో ఏ పార్టీ అయినా  తగిన సంఖ్యా బలంతో ముందుకు వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు