అఖిలేష్‌కు షాకిచ్చిన ఎస్పీ ఎమ్మెల్యే

14 Jan, 2019 15:45 IST|Sakshi

లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో కీలకంగా మారిన ఉత్తరప్రదేశ్‌లో కూటమిగా పోటీచేస్తున్నట్లు మాయావతి, అఖిలేష్‌ ప్రకటించి కొన్ని గంటలు కూడా గడవకముందే ఎస్పీ ఎమ్మెల్యే కూటమికి షాకిచ్చారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి యూపీలో వర్కౌట్‌ కాదని ఎస్పీ ఎమ్మెల్యే  హరిఓం యాదవ్‌ అన్నారు. మాయావతి చెప్పిన ప్రతి దానికి అఖిలేష్‌ తలొగ్గి ఉన్నంత వరకు మాత్రమే పొత్తు కొసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో చెరో 38 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఎస్పీ, బీఎస్పీ శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. 

యూపీలోని సిర్సాగంజ్‌ శాసన సభ్యుడైన హరిఓం యాదవ్‌ ఇలా అన్నారు. ‘‘కూటమి కోసం మాయావతి చెప్పిన విధంగా అఖిలేష్‌ వింటున్నారు. వీరి పొత్తుపై కొందరు ఎస్పీ నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా ఫిరోజాబాద్‌ లోక్‌సభ పరిధిలో కూటమి అస్సలు ఫలించదు. ఎన్నో ఏళ్లుగా అక్కడ ఎస్పీ, బీఎస్పీ ప్రత్యుర్థులుగా తలపడుతున్నాయి’’ అంటూ ఎస్పీ చీఫ్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు. హరిఓం ప్రాతినిథ్యం వహిస్తున్న సిర్సాగంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఫిరోజాబాద్‌ లోక్‌సభ పరిధిలోనిది.

ఓవైపు బీజేపీని ఓడిస్తామని ధీమాతో ఉండగా.. సొంత పార్టీ ఎమ్మెల్యేనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఎస్పీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీకి ఎదుర్కొనే లక్ష్యంతో దశాబ్దాల వైరుధ్యాన్ని పక్కన పెట్టి ఎస్పీ, బీఎస్పీలు చేతులు కలిపిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రకటన కూడా విడుదల కాకముందే సొంతపార్టీ ఎమ్మెల్యేనే ఇలా వ్యాఖ్యానించడం ఎస్పీ నేతలకు మింగుడుపడటం లేదు. 

ఎస్‌పీ, బీఎస్‌పీ.. చెరో 38

>
మరిన్ని వార్తలు