విపక్ష కూటమితో బీజేపీకి కష్టమే!

30 Nov, 2018 04:41 IST|Sakshi

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో యూపీలో పరిస్థితిపై టైమ్స్‌ నౌ– సీఎన్‌ఎక్స్‌ సర్వే

న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే, ఢిల్లీ గద్దెనెక్కే పార్టీల భవితవ్యం తేల్చే ప్రధాన రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్‌ ఒకటి. మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 80 ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. 2014లో ఈ ఒక్క రాష్ట్రం నుంచే బీజేపీ 71 సీట్లు గెలుచుకుంది. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీయేతర పక్షాలు మహా కూటమిగా ఏర్పడితే బీజేపీకి కష్టమేనని, గెలుచుకునే స్థానాల సంఖ్య భారీగా తగ్గుతుందని ‘టైమ్స్‌ నౌ– సీఎన్‌ఎక్స్‌’ల తాజా సర్వే తేల్చింది.

విపక్షంలోని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), బహుజన సమాజ్‌పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్డీ)లు వేర్వేరుగా పోటీ చేస్తే బీజేపీ 55 సీట్లు గెలుచుకోగలదు కానీ, ఆ పార్టీలు కలిసి మహా కూటమిగా ఏర్పడి పోటీ చేస్తే మాత్రం బీజేపీ 31 స్థానాలకే పరిమితమవుతుందని, విపక్ష కూటమి 49 సీట్లలో గెలుస్తుందని ఆ సర్వే తేల్చింది. అంటే, వేర్వేరుగా పోటీ చేసినా బీజేపీ గెలిచే స్థానాల సంఖ్య 2014 కన్నా 16 సీట్లు తక్కువే కావడం గమనార్హం. కాంగ్రెస్‌ను కాదని ఎస్పీ, బీఎస్పీలు మాత్రమే జట్టుకడితే ఆ కూటమి 33 స్థానాలు, కాంగ్రెస్‌ రెండు స్థానాలు గెలుచుకుంటాయని, 45 సీట్లలో బీజేపీ విజయం సాధిస్తుందని పేర్కొంది.

మరిన్ని వార్తలు