‘బీజేపీ ఓటమికే కూటమి’

8 May, 2018 14:05 IST|Sakshi

లక్నో: రానున్న ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇప్పటినుంచే పావులు కదుపుతున్నారు. దానిలో భాగంగానే 2019 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీలో జరిగిన గోరఖ్‌పూర్‌, పుల్‌పూర్‌ ఉప ఎన్నికల్లో ఎస్సీ- బీఎస్పీ కూటమిగా పోటీచేసి సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ సొంత నియోజవర్గంలో బీజేపీని ఓడించిన విషయం తెలిసిందే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అవే ఫలితాలను పునరావృతం చేయాలని, మతతత్వ బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-బీఎస్పీ కూటమిగా పోటీచేస్తున్నట్లు మాయావతి తెలిపారు. సీట్ల పంపకాల విషయంలో ఎస్పీ అధినేత అఖిలేష్‌తో చర్చించిన తర్వాత అధికారికంగా ప్రకటిస్తామని అన్నారు.

2014 లోక్‌సభ ఎన్నికల్లో వేర్వేరుగా పోటీచేసిన ఎస్పీ-బీఎస్పీ 41శాతం ఓట్లను సాధించాయి. 43శాతం ఓట్లను సాధించిన బీజేపీ 73 స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎస్పీ ఐదు, కాంగ్రెస్‌ రెండు స్థానాల్లో విజయం సాధించగా, బీఎస్పీ అసలు ఖాతా తెరవలేకపోయింది. మతతత్వ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను ఎదుర్కొనేందుకు లౌకిక శక్తులు ఏకం కావల్సిన అవసరముందని, దానిలో భాగంగానే  ఎస్పీతో పొత్తు అని మాయావతి  పేర్కొన్నారు. త్వరలో జరుగనున్న కైరానా, నూర్‌పూర్‌ ఉప ఎన్నికల్లో  బీజేపీని ఓడించేందుకు ఎస్పీ-ఆర్‌ఎల్‌డీ అభ్యర్థులకు తమ పార్టీ మద్దతు ఉంటుందని తెలిపారు.

మరిన్ని వార్తలు