గఠ్‌బంధన్‌కు గుడ్‌బై

4 Jun, 2019 04:35 IST|Sakshi

యూపీ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ

బీఎస్పీ చీఫ్‌ మాయావతి వెల్లడి

న్యూఢిల్లీ: త్వరలో యూపీలో జరగనున్న ఉపఎన్నికల్లో ఒంటరిగానే పోటీకి దిగనున్నట్లు బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. కూటమిలో ఉంటే గెలుస్తామనుకోవద్దని, ముందుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు. ఢిల్లీలో పార్టీ నేతలతో ఆమె మాట్లాడారు. ఇటీవలి ఎన్నికల్లో ఎస్‌పీ–బీఎస్‌పీ– ఆర్‌ఎల్‌డీ ‘మహా గఠ్‌ బంధన్‌’ సీట్లు సర్దుబాటు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా మాయా వ్యాఖ్యలతో మహాగఠ్‌బంధన్‌ భవిష్యత్తు ప్రశ్నార్థకంలో పడినట్లయింది. ‘ఎమ్మెల్యేలు, పార్టీ పదవుల్లో ఉన్న వారు, కొత్తగా ఎన్నికైన ఎంపీలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండండి. కూటమితో పనిలేకుండా ఒంటరిగానే బరిలో నిలుస్తాం. రాష్ట్రంలో బీఎస్‌పీ సంప్రదాయ ఓటుబ్యాంకు ఉన్న 10 సీట్లను బీఎస్‌పీ గెలుచుకుంది. ఎస్‌పీ ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు’ అని వివరించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన 9 మంది, బీఎస్‌పీ, ఎస్‌పీలకు చెందిన ఒక్కొక్కరు చొప్పున ఎమ్మెల్యేలు లోక్‌సభకు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రంలో ఖాళీ అయిన అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నిక అవసరమైంది.

ములాయం కుటుంబీకులే గెలవలేదు
యూపీలో బీఎస్‌పీ–ఎస్‌పీ– ఆర్‌ఎల్‌డీతో ఏర్పాటైన మహాగఠ్‌బంధన్‌ వృథాయేనని మాయావతి అన్నారు. ‘యాదవుల ఓట్లు మన అభ్యర్థులకు బదిలీ కాలేదు. మన పార్టీ ఓట్లు వాళ్లకు పడ్డాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసిన నియోజకవర్గాల్లో ఎస్పీ గెలిచింది. యాదవుల ఓట్లు అఖిలేశ్‌ యాదవ్‌ కుటుంబీకులకు కూడా పడలేదు’ అని తెలిపారు. కూటమి లేకున్నా ఎస్‌పీ అధ్యక్షుడు  అఖిలేశ్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఎందుకంటే అతడు తండ్రి(ములాయం సింగ్‌ యాదవ్‌)లాంటి వాడు కాదు’ అని మాయ పేర్కొన్నారు. ‘అఖిలేశ్‌తో విభేదించిన అతడి బాబాయి శివ్‌పాల్‌యాదవ్, కాంగ్రెస్‌ కారణంగానే యాదవుల ఓట్లు చీలాయి. అఖిలేశ్‌ భార్య డింపుల్‌ను కూడా గెలిపించుకోలేకపోయాడు. అతని ఇద్దరు సోదరులూ ఓడారు. మనం ఈ ఉప ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేద్దాం’ అని తెలిపారు.

సామాజిక న్యాయం కోసం కలిసి పోరాడతాం: అఖిలేశ్‌
సామాజిక న్యాయం కోసం బీఎస్‌పీతో కలిసి పోరాటం సాగిస్తామని ఎస్‌ చీఫ్‌ అఖిలేశ్‌యాదవ్‌ తెలిపారు. గతంతో పోలిస్తే ఈసారి ఎన్నికలు జరిగిన తీరు వేరేగా ఉందని, అది తనకు కూడా అర్థం కాలేదని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ఫెరారీ, సైకిల్‌ (ఎస్‌పీ ఎన్నికల గుర్తు) మధ్య పోటీ. ఫెరారీయే గెలుస్తుందని అందరికీ తెలుసు. అంశాల ప్రాతిపదికన కాకుండా వేరే రకంగా ఎన్నికలు జరిగాయి. టీవీలు, సెల్‌ఫోన్ల ద్వారా ప్రజలతో వాళ్లు(బీజేపీ)మైండ్‌ గేమ్‌ ఆడారు. అది నాకూ అర్థం కాలేదు’ అని పేర్కొన్నారు. ఆ యుద్ధ తంత్రం అర్థమైన రోజున తాము విజేతలుగా నిలుస్తామన్నారు.

మరిన్ని వార్తలు