యూపీలో గఠ్‌బంధన్‌ హవా

6 Apr, 2019 05:03 IST|Sakshi

బిహార్‌లో ఎన్డీయే పైచేయి

లోక్‌సభ ఎన్నికలపై ఏబీపీ–నీల్సన్‌ సర్వే

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ నాయకత్వంలోని గఠ్‌బంధన్‌ అత్యధిక స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, అలాగే బిహార్‌లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మెజారిటీ సీట్లు దక్కించుకోవచ్చని ఏబీపీ–నీల్సన్‌ సర్వే వెల్లడించింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 80 లోక్‌సభ స్థానాల్లో సమాజ్‌వాదీపార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌లతో కూడిన గఠ్‌బంధన్‌ (కూటమి) 42 స్థానాలు గెలుచుకోవచ్చనీ, బీజేపీ, అప్నాదళ్‌ కూటమికి 36 సీట్లు రావచ్చని ఆ సర్వే పేర్కొంది.

ఒంటరిగా బరిలో దిగిన కాంగ్రెస్‌కు ఇక్కడ రెండు సీట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ కూటమి 73 సీట్లలో విజయం సాధించగా ఎస్పీ 5, కాంగ్రెస్‌ 2 సీట్లు గెలుచుకున్నాయి. బిహార్‌లో మొత్తం 40 సీట్లలో ఎన్డీయేకు 34, గఠ్‌ బంధన్‌కు 6 సీట్లు వచ్చే అవకాశం ఉందని సర్వే నివేదిక పేర్కొంది. యూపీలో సీట్లు తగ్గినా బీజేపీ కూటమికి ఓట్ల శాతం పెరిగే అవకాశం ఉందని, గఠ్‌బంధన్‌ కంటే ఎక్కువగా (43శాతం) ఓట్లు వస్తాయని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ ఓట్ల శాతం కూడా 7.8(2014) నుంచి 9 శాతానికి పెరగొచ్చని పేర్కొంది.

మార్చి16–24వ తేదీల మధ్య 20వేల మందికిపైగా ఓటర్ల అభిప్రాయాలను సేకరించి ఈ నివేదిక రూపొందించారు. ప్రధాని మోదీ పనితీరు బాగుందని సర్వేలో మెజారిటీ ఓటర్లు అభిప్రాయపడ్డారు. ముస్లిం ఓటర్లు మోదీ తీరు ఏవరేజ్‌గా ఉందన్నారు. ఎన్డీయే ప్రభుత్వం పనితీరుకు ఓటర్లు 3.73 మార్కులు ఇచ్చారు. అవినీతి, నిరుద్యోగం ఈ ఎన్నికల్లో ముఖ్యాంశాలని మెజారిటీ ఓటర్లు చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించే వారికే ఓటేస్తామని అత్యధికులు స్పష్టం చేశారు. మత సామరస్యం, ధరల నియంత్రణ, వెనకబడిన వర్గాలకు సంక్షేమ పథకాలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపిస్తోందని సర్వే నివేదిక పేర్కొంది.

బిహార్‌లో 34 సీట్లు..
బీజేపీ, జనతాదళ్‌ యునైటెడ్, లోక్‌జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీయే 52 శాతం ఓట్లతో 34 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని నీల్సన్‌ సర్వే పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, రాష్ట్రీయలోక్‌ సమతా పార్టీ, సీపీఐ (ఎంఎల్‌)తో కూడిన గఠ్‌బంధన్‌కు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని తెలిపింది. మార్చి 17–26 మధ్య పది వేల మంది ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుని ఈ అంచనాకు వచ్చినట్టు నీల్సన్‌ సంస్థ పేర్కొంది.
ఇక్కడ కూడా మోదీ పనితీరు బాగుందని, నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం పనితీరు బాగానే ఉందని అత్యధికులు అభిప్రాయపడ్డారు. కేంద్రంలో ఎన్డీయే పనితీరుకు 3.92 మార్కులు ఇచ్చారు. ఇక్కడ కూడా అవినీతి, నిరుద్యోగం ప్రజల ప్రధాన సమస్యలని సర్వేలో తేలింది. ఇదిలా ఉండగా, శత్రుఘ్న సిన్హా బీజేపీని వదిలి కాంగ్రెస్‌లో చేరడం మంచిదేనని 38 శాతం ఓటర్లు అభిప్రాయపడగా, తప్పు నిర్ణయమని 39 శాతం వ్యాఖ్యానించారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు