ప్రధాని X మాజీ కానిస్టేబుల్‌

30 Apr, 2019 04:10 IST|Sakshi

వారణాసిలో మోదీపై తేజ్‌బహదూర్‌ను దింపిన సమాజ్‌వాదీ పార్టీ

లక్నో: వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీకి సమాజ్‌వాదీ పార్టీ తన అభ్యర్థిని మార్చింది. భద్రతాదళాలకు పెట్టే ఆహార నాణ్యత విషయంలో ఫిర్యాదు చేసి విధుల నుంచి తొలగిన బీఎస్‌ఎఫ్‌ మాజీ కానిస్టేబుల్‌ తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ను బరిలోకి దింపుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు యాదవ్‌ అభ్యర్థిత్వాన్ని ఎస్పీ నేత ప్రకటించారు. బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్‌ (ఆర్‌ఎల్‌డీ) లతో కూడిన ఎస్పీ కూటమి వారణాసి నుంచి మొదట తన అభ్యర్థిగా షాలిని యాదవ్‌ను ప్రకటించింది.

‘అవినీతిపై ప్రశ్నించినందుకు నన్ను విధుల నుంచి తొలగించారు. భద్రతా దళాల్లో ఉన్న అవినీతిని తొలగించడమే నా ప్రధాన ధ్యేయం’అని తేజ్‌ బహదూర్‌ విలేకరులకు వెల్లడించారు. మాజీ బీఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ అయిన తేజ్‌ బహదూర్‌ యాదవ్‌ జమ్మూకశ్మీర్‌లోని సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు అందించే ఆహారంలో నాణ్యత లేదని ఫిర్యాదుచేస్తూ 2017లో సోషల్‌ మీడియాలో ఓ వీడియో అప్‌లోడ్‌ చేశారు. దీంతో ఆయన్ను విధుల నుంచి తొలగించారు. 7వ దశ ఎన్నికల్లో భాగంగా వారణాసిలో మే 19న ఎన్నికలు జరుగనున్నాయి.  

మరిన్ని వార్తలు