50 వేల కళ్లజోడు.. అసెంబ్లీని కుదిపేసింది

4 Feb, 2018 12:09 IST|Sakshi
కేరళ అసెంబ్లీ లోపల.. ప్రతీకాత్మక చిత్రం

తిరువనంతపురం : స్పీకర్‌ కళ్లజోడు వ్యవహారం కేరళ అసెంబ్లీని కుదిపేస్తోంది. ఖరీదుతో కూడిన కళ్లద్దాలు స్పీకర్‌ ధరించటం.. ఆ సొమ్మును ప్రభుత్వ ఖజానా నుంచే ఖర్ఛు చేయటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. 

కేరళ అసెంబ్లీ స్పీకర్‌ శ్రీరామకృష్ణన్‌ సుమారు 50వేల ఖరీదుతో ఈ మధ్యే కళ్లజోడు కొనుకున్నారు. దీనిపై ప్రతిపక్ష సభ్యుడొకరు ఆర్టీఐ ద్వారా సమాచారం రాబట్టారు. అందులో గ్లాసులకు 45,000 వేల రూపాయలు, ఫ్రేమ్‌కు 4,500 రూ. ఖర్చు చేసినట్లు ఉంది. ఈ మొత్తం సొమ్ము ప్రభుత్వ ఖజానా నుంచి ఆయనకు రీ-ఎంబర్స్‌ అయినట్లు తేలింది. దీంతో ప్రతిపక్షాలు విమర్శలకు దిగాయి. ఇంతకు ముందు ఆరోగ్య శాఖ మంత్రి కేకే శైలజ కూడా 28,000 రూ. కళ్లజోడు కొనుక్కోవటం.. ఆ సొమ్ము కూడా రీఎంబర్స్‌ కావటం విమర్శలకు తావునివ్వగా... ఇప్పుడు స్పీకర్‌ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో విమర్శలు తారా స్థాయికి చేరుకున్నాయి. స్పీకర్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తూ ప్రతిపక్షాలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చాయి.

స్పీకర్‌ వివరణ... గత కొన్ని రోజులుగా నా కళ్లు సరిగ్గా కనిపించటం లేదు. నా పనులు చేసుకోవటం కూడా ఇబ్బందిగా అనిపిస్తోంది. అధికారిక కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన బాధ్యత నా పై ఉంది.  అందుకే వైద్యుడి సలహా మేరకు మంచి కళ్లజోడు తీసుకున్నా. తప్పేముంది అని శ్రీరామకృష్ణన్‌ వివరణ ఇచ్చారు.

కాగా, కేరళ శాసనసభ్యులు, వారి కుటుంబ సభ్యుల చికిత్స పేరిట బిల్లులతో మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌ సొమ్మును లక్షల్లో వసూలు చేస్తున్నారు. వీరిలో అధికార పక్ష నేతలే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. దీనిపై ఇటీవలె స్థానిక మీడియా ఛానెళ్లలో ప్రత్యేక కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే ఈ తతంగం వెనుక మొత్తం బీజేపీ హస్తం ఉందని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపిస్తున్నారు.

మరిన్ని వార్తలు