రేపటి నుంచి బడ్జెట్‌ సమావేశాలు

10 Jul, 2019 03:14 IST|Sakshi

ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం

10 గంటలకు మండలి సమావేశాలు 

అంతా సహకరించాలి

బడ్జెట్‌ సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో స్పీకర్‌ తమ్మినేని సమీక్ష

సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈమేరకు గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు. గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉ. 10 గంటలకు శాసన మండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయ సభలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమవుతాయి.

నూతన సర్కారు తొలి బడ్జెట్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఉదయం 11 గంటలకు 2019–20 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీకి సమర్పిస్తారు. శాసనమండలిలో సభా నాయకుడు, రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి కురసాల కన్నబాబు  అసెంబ్లీలో ప్రవేశపెడతారు. శాసన మండలిలో పశు సంవర్థక, మత్య్స శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ వ్యవసాయ బడ్జెట్‌ను సమర్పిస్తారు. 

బడ్జెట్‌పై సమీక్షించిన సీఎం..
తొలిసారిగా అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులతో కలసి సుదీర్ఘ కసరత్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన నవరత్నాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం కల్పించేలా కసరత్తు జరిగింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు సర్కారు అస్తవ్యస్తం చేసి నూతన ప్రభుత్వానికి అప్పగించింది. దీన్ని చక్కదిద్దేందుకు చాలా సమయం పట్టనున్నా ప్రజలకు ఇచ్చిన మాట మేరకు నవరత్నాల పథకాలకు బడ్టెట్‌లో తగిన కేటాయింపులు చేయాలని నిర్ణయించారు. బడ్జెట్‌లో విద్య, వైద్య రంగాలతో పాటు వ్యవసాయ, సాగునీటి రంగాలకు అత్యధిక ప్రాధాన్యం కల్పించనున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు, స్వరూపంపై ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం కూడా స్వయంగా సమీక్ష నిర్వహించారు. 

బిల్లులపై కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి: సీఎస్‌
ఈ సమీక్షలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాల్లో 10 నుంచి 12 బిల్లులు ప్రవేశపెట్టే అవకాశాలున్నందున ముందుగానే సిద్ధం చేసేలా సంబంధిత శాఖల కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. అన్ని శాఖలకు సంబంధించిన బిల్లులు, ప్రశ్నలకు సమాధానాలు తదితర అంశాలన్నిటినీ సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఆర్పీ సిసోడియా పర్యవేక్షించాలని సీఎస్‌ సూచించారు. ఇప్పటివరకు  సభ్యులు అడిగిన ప్రశ్న (ఎల్‌ఏక్యూ, ఎల్‌సీక్యూ) లకు సమాధానాలను వెంటనే సభకు సమర్పించాలన్నారు. 

పరిమిత సంఖ్యలో సందర్శకులకు అనుమతి
బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో భద్రతకు సంబంధించిన అంశాలపై స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ మంగళవారం శాసనసభ కమిటీ హాల్‌లో పోలీస్‌ ఉన్నతాధికారులతో సమీక్షించారు. గుంటూరు జిల్లా గ్రామీణ ఎస్పీ జయలక్ష్మి, అదనపు డీజీపీ హరీశ్‌ గుప్తా ఈ సందర్భంగా కీలక సూచనలు చేశారు. సీఆర్డీఏ అధికారులతో చర్చించి అసెంబ్లీ వద్ద కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని సభాపతి తెలిపారు. బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతున్నందున సందర్శకులను పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతించి పాస్‌లను తగ్గించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈనెల 16వతేదీ నాటికి శాసనసభా ప్రాంగణంలో కేఫ్‌టేరియా అందుబాటులోకి వస్తుందన్నారు.

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో సజావుగా సాగేందుకు సభ్యులంతా సహకరించాలని అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ కోరారు. మంగళవారం శాసనసభ కమిటీ హాల్లో బడ్జెట్‌ సమావేశాల ఏర్పాట్లపై వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్‌ మాట్లాడుతూ సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులపై ముందుగానే సమాచారం ఇవ్వాలని అధికారులకు సూచించారు. సంబంధిత బిల్లు వివరాలు వెల్లడించకుండా చివరి నిమిషంలో ప్రవేశపెట్టే సంస్కృతికి తెరపడాలన్నారు. బిల్లును ముందుగానే సిద్ధం చేసి పూర్తిగా అన్ని అంశాలు పరిశీలించాకే శాసనసభలో ప్రవేశపెట్టేందుకు పంపాలన్నారు. మంత్రులుగా నియమితులైన కొత్త సభ్యులు ఆయా శాఖలకు సంబంధించిన అంశాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకునేందుకు కార్యదర్శులు పూర్తిగా సహకరించాలని, వార్షిక నివేదికలను సకాలంలో సభకు సమర్పించాలని స్పీకర్‌ సూచించారు. సభ్యుల ప్రశ్నలకు సకాలంలో సమాధానాలు పంపేలా కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పీకర్‌ కోరారు. ఈసారి సుమారు 70 మంది సభ్యులు శాసనసభకు కొత్తగా ఎన్నికైనందున సభా వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి సభ్యుడికీ అవకాశం కల్పించేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. 

పటిష్ట బందోబస్తు
గుంటూరు: తాత్కాలిక అసెంబ్లీలో గురువారం నుంచి బడ్జెట్‌ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. గుంటూరు రూరల్‌ ఎస్పీ ఆర్‌.జయలక్ష్మి మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, స్పీకరు, డెప్యూటీ స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలు, హాజరవుతున్న కారణంగా అసెంబ్లీ వద్ద మూడంచెల విధానంలో కట్టుదిట్టమైన బందోబస్తుకు ప్రణాళిక రూపొందించారు. రెండు రోజుల ముందు నుంచే   బాంబ్‌ అండ్‌ స్క్వాడ్‌ బృందాలతో జల్లెడ పట్టారు. నిఘా వర్గాల సూచనల మేరకు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా తుళ్లూరు మండల పరిధిలో పోలీస్‌ యాక్ట్‌–30 అమలు చేశారు. అసెంబ్లీ పరిధిలోని 10 కిలోమీటర్ల వరకు సెక్షన్‌ 144 అమల్లోకి తెచ్చారు. గరుడా కమాండ్‌ కంట్రోల్‌ నుంచి సీసీ కెమేరాల ద్వారా సచివాలయం, అసెంబ్లీ పరిసర ప్రాంతాలను సునిశితంగా పర్యవేక్షిస్తున్నారు

మరిన్ని వార్తలు