నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు: సీఈఓ

9 Apr, 2019 17:09 IST|Sakshi
తెలంగాణ సీఈఓ రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, నిజామాబాద్‌లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో రజత్‌ కుమార్‌ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణాలో 11వ తేదీ జరగబోయే పోలింగ్‌లో 2 కోట్ల 97 లక్షల 8599 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. ఇందులో సర్వీస్‌ ఓటర్లు 11 వేల 320, ఎన్నారై ఓటర్లు 11 వేల 731 మంది ఉన్నారని చెప్పారు. తెలంగాణాలో 34 వేల 604 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, అన్ని పోలింగ్‌ కేంద్రాలకు సామగ్రి పంపిస్తామని అన్నారు.

48 గంటల ముందు ప్రచారం బంద్‌
‘పోలింగ్‌కు 48 గంటల ముందు ప్రచారం బంద్‌ చెయ్యాలి. పోలింగ్‌ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. మావోయిస్టు ప్రాంతాల్లో 7 గంటల నుంచి 4 గంటలకు వరకు మాత్రమే ఓటు వేయడానికి వీలుంది. నిజామాబాద్‌లో మాత్రం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌లో పాల్గొనవచ్చు. 4169 పోలింగ్‌ కేంద్రాలకు లైవ్‌ వెబ్‌క్యాస్టింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం. అన్ని పోలింగ్‌ కేంద్రాలలో వీడియో రికార్డ్‌ చేస్తాం. గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయవంతంగా ఎన్నికలు నిర్వహించాం. ఈ ఎన్నికల్లో కూడా విజయవంతంగా నిర్వహిస్తాం. ఫోటో ఓటర్‌ స్లిప్‌ పంపిణీలో కొంత ఇబ్బంది ఉంది. గత ఎన్నికల్లో సమస్య ఉంది కానీ ఈసారి అలాంటి సమస్య లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన ఏవైనా ఐడీ కార్డులు చూపించి ఓటు వేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 90 శాతం ఓటర్‌ స్లిప్‌లు పంపిణీ చేశా’ మని రజత్‌ కుమార్‌ వెల్లడించారు.

సోషల్‌ మీడియా వార్తలపై నిఘా
‘ సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలపై కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకుంటున్నాం. 579 వార్తలు పెయిడ్‌ న్యూస్‌ కింద కేసులు బుక్‌ చేశాం. తెలంగాణాలో రూ.52 కోట్ల 62 లక్షల నగదు సీజ్‌ చేశాం. సీ-విజిల్‌ యాప్‌కు మంచి స్పందన వస్తోంది. 1435 కేసులు సి-విజిల్‌ ద్వారా బుక్‌ అయ్యాయి. అన్ని కేసులు తక్షణమే పరిష్కరిస్తున్నాం. కుల మతాల పేరు మీద ప్రచారం చేస్తే కఠినంగా చర్యలు ఉంటాయి. రేపు 5 గంటల నుంచి న్యూస్‌ ఛానల్‌లో ఎన్నికల ప్రచారం ప్రసారం చేయకూడదు. మద్యం కూడా బంద్‌ చెయ్యాలి. రేపు సాయంత్రం 5 గంటల నుంచి స్థానికేతరులు ఉండకూడదు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజవర్గంలో సాయంత్రం 6 గంటల వరకు ప్రచారం చేసుకోవచ్చు. పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశాక సెల్ఫీలు తీసుకుంటే చర్యలు ఉంటాయ’ని స్పష్టంగా పేర్కొన్నారు.

అన్ని సంస్థలకు పోలింగ్‌ రోజు సెలవు
‘ అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు పోలింగ్‌ రోజున సెలవు ఇవ్వాలి. లేదంటే చర్యలు ఉంటాయి.గత ఎన్నికల్లో ఈవీఎంలలో కొన్ని సాంకేతిక ఇబ్బందులు వచ్చాయి. కానీ ఈసారి బెల్‌ కంపెనీకి చెందిన లేటెస్ట్‌ యంత్రాలు వాడుతున్నాం. ఎలాంటి ఇబ్బంది లేదు. నిజామాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గానికి వెళ్లి వచ్చాను. చాలా బాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తక్కువ సమయంలో అన్ని ఏర్పాట్లు చేశాం. బ్యాలెట్‌ పేపర్‌లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. బ్యాలెట్‌తో కౌంటింగ్‌ జరిపేటప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది. రైతులతో అన్ని అంశాలపై చర్చించాం. వాళ్లు చాలా సంతోషం వ్యక్తం చేశారు. లోకల్‌ బాడీ ఎన్నికలకు అనుమతి ఇచ్చారు. ఫలితాలు మాత్రం లోక్‌సభ ఎన్నికల తర్వాతే విడుదల చెయ్యాల’ని రజత్‌ కుమార్‌ చెప్పారు.

ముగిసిన ప్రచారం

తెలంగాణాలో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఒక్క నిజామాబాద్‌ మినహా అన్ని నియోజకవర్గాల్లో 5 గంటల వరకే ఈసీ పర్మిషన్‌ ఇచ్చింది. నిజామాబాద్‌ నియోజకవర్గంలో మాత్రం అభ్యర్థులు 6 గంటల దాకా ప్రచారం చేసుకునే వెసులుబాటు ఉంది.

 

మరిన్ని వార్తలు