సెంచరీ కొడతాం!

22 Sep, 2018 01:13 IST|Sakshi
తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌

ముఖ్యమంత్రి కేసీఆరే మా ‘తారక’మంత్రం

సాక్షి ఇంటర్వ్యూలో మంత్రి కె.తారక రామారావు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘మా కెప్టెన్‌ కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ పార్టీ తప్పకుండా సెంచరీ కొట్టబోతోంది. ప్రజల ఆశీర్వాదం మాకుంది. ఉద్యమ సమయంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్‌తో నిలిచారు. ఈ నాలుగేళ్లలో కేసీఆర్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. అభివృద్ధి పురోగతిలో ఉంది. కారు వేగంగా వెళుతోంది. డ్రైవర్‌ బాగా నడుతున్నారు. డ్రైవర్‌ను మార్చకూడదని మొన్న సురేష్‌రెడ్డి మంచి మాట అన్నరు. ప్రజలు కూడా అదే ఆలోచనలో ఉన్నరు. డ్రైవర్‌ అద్భుతంగా ఉన్నాడు.. తెలంగాణ అనే కారు మంచి కండిషన్లో ఉంది.. దూసుకుపోతోంది. కారు డ్రైవర్‌ను ప్రజలు మార్చరన్న విశ్వాసం నాకు ఉంది’’అని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ధీమా వ్యక్తంచేశారు.

‘‘40 మంది లేదా 38 మందిని మారుస్తారని పత్రికల్లో రాశారు. ఒకరిద్దరు మినహా సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని ముఖ్యమంత్రి పదేపదే అన్నారు. ఆయన ఏదైనా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. గడిచిన 3 ఏళ్లలో దాదాపు 15 సర్వేలు చేశారు. అన్ని సర్వేల్లో కూడా కచ్చితంగా గెలుస్తాం అనే వచ్చింది. కొంతమంది సిట్టింగుల మీద వ్యతిరేకత ఉన్నా, రేపు ఎన్నికలు జరగబోయేది కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి కావాలా? వద్దా? అన్న అంశం మీదే’’అని ఆయన స్పష్టంచేశారు. 90 శాతం మంది ప్రజలు అదే అంశం మీద ఓటేస్తారని పేర్కొన్నారు. ఎక్కడైనా స్థానిక నాయకుడిపై వ్యతిరేకతతో టీఆర్‌ఎస్‌కు ఓటేయకపోతే రేపు కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడుతదనే ఆలోచన ప్రజల్లో ఉందని, కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని విశ్వాసం వ్యక్తంచేశారు. అభ్యర్థిపై స్వల్ప వ్యతిరేకత ఉన్నా.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో ప్రజలు తప్పకుండా టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తారని చెప్పారు. కేసీఆర్‌ శాసనసభను రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు సిద్ధమైన నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై శుక్రవారం బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ ‘సాక్షి టీవీ’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. 


ప్రశ్న: అసెంబ్లీని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చింది? 
కేటీఆర్‌: ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, పోరాటాలు, ప్రాణ త్యాగాల తర్వాత సిద్ధించిన ఈ రాష్ట్రంలో రాజకీయాలకు ఎక్కువ అవకాశం ఇవ్వకుండా కనీసం తొలి ఐదేళ్లు ప్రజల కోణంలో అభివృద్ధి జరగాలని రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్, మేము ఆశించాం. దీనికి అనుగుణంగా చాలా ఉదారంగా వ్యవహరించాం. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేలు అనే తేడా లేకుండా రూ.3 కోట్ల నిధులను ఖర్చుపెట్టుకునే అవకాశం కల్పించాం. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, రోడ్ల నిర్మాణం అన్ని పథకాల విషయంలో ఉదారంగా వ్యవహరించాం. తెలంగాణ ఏర్పడటానికి కారణమైన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో విపక్షాలు కలిసివస్తాయని అనుకున్నం. కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని పాలమూరు, కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను శరవేగంగా కట్టేందుకు సీఎం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్‌ వారు చనిపోయిన వ్యక్తుల దొంగ వేలిముద్రలతో 186 కేసులు వేశారు. ఎట్టి పరిస్థితిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసి మంచి పేరు తెచ్చుకోకూడదు అనే ఒక కక్ష పూరితమైన వ్యవహారమిది. ఈ వ్యవహారం ఎంత వరకు పోయిందంటే.. ముఖ్యమంత్రిని నోటికి వచ్చినట్టు తిట్టడమే కాకుండా సీఎం కుటుంబ సభ్యులు, రాజకీయాల్లో లేనివారు, చివరకు నా పిల్లలను కూడా అనరాని మాటలతో వ్యక్తిగతంగా దూషించారు. ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ కాంగ్రెస్‌లో అసహనం పెరిగిపోతోంది. రోజురోజుకీ వారిలో నిరాశ, నిస్పృహ, అసహనం పెరుగుతా ఉంది. వచ్చే ఏప్రిల్‌లో ఎన్నికలు ఉంటే ఇంకా విషం చిమ్ముతారు. ఇదంతా కాదు. ప్రజల దగ్గరికి వెళ్దాం. ప్రజాకోర్టులో తేల్చుకుందామని నిర్ణయం తీసుకున్నం. 

రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని విమర్శించడం సహజం. దానికే ఇంత పెద్ద నిర్ణయం?  
హద్దులు దాటి చిల్లర విమర్శలు చేస్తున్నారు. నా కొడుకు శరీర ఆకృతి గురించి కూడా మాట్లాడతారా? నువ్వు పొట్టొడు, గడ్డపోడు అని కాంగ్రెస్‌వారిని ఉద్దేశించి మేం మాట్లాడలేమా? రాజకీయాల్లో విమర్శలుండవచ్చు కానీ చిల్లరతనానికి, లేకితనానికి హద్దులుంటాయి. భావదారిద్య్రం ఉండరాదు.  

ఒకరిద్దరు వ్యక్తిగత విమర్శ చేశారని బాధ్యతాయుత స్థానంలో ఉండి ప్రభుత్వాన్ని రద్దు చేసుకుంటారా?  
ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బాధ్యతాయుతమైన స్థానంలో లేరా? కేటీఆర్‌ అమెరికాలో అంట్లు తోమేవాడు అని విమర్శించారు. ఎవరి పని వారు చేసుకోవడం తప్పా? నువ్వు ఇక్కడ దొర కావచ్చు. ఫ్యూడల్‌ కావచ్చు. రేవంత్‌రెడ్డి నోటికి హద్దులు అక్కర్లేదా? ముఖ్యమంత్రిని పట్టుకుని ఎలా పడితే అలా మాట్లాడవచ్చా? ఏ నీళ్ల కోసమైతే తెలంగాణ ప్రజలు దశాబ్దాల కోసం ఎదురు చూస్తున్నారో దాని మీద 186 కేసులు వేయడమే కాకుండా, వాటిని సమర్థించుకునే పరిస్థితి. ఒకవైపు కేసులు వేస్తారు. మరోవైపు నీళ్లు రావట్లేదు, రిజర్వాయర్‌ కట్టట్లేదని ధర్నాలు చేస్తారు. ఈ ద్వంద్వ నీతిని సైతం ప్రజల ముందు ఉంచదలుచుకున్నం. 

ప్రాజెక్టులపై వేసిన కేసులను ప్రభుత్వం న్యాయపరంగా ఎదుర్కొనే అవకాశముంది కదా? 
కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులిస్తే ఓర్చుకోలేక సుప్రీంకోర్టుకు వెళ్లారు. అడ్డుకునేది వీరే. ప్రజల దగ్గర మమ్మల్ని మలినం చేసేది వీరే. అలాంటి సందర్భంలో మేము ప్రజల వద్దకు వెళ్లడంలో తప్పేముంది? రాష్ట్రంలో ప్రజల ప్రయోజనాలు పట్టని, రైతుల నోట్ల మట్టి కొట్టే పనికిమాలిన ప్రతిపక్షం వల్లే ప్రజల వద్దకు వెళ్లి తీర్పు అడుగుతున్నం. ప్రజల దగ్గరికి వెళ్లడానికి భయపడే ప్రతిపక్షం ఉండడం దరిద్రం కాదా?  

జాతీయ పార్టీల నాయకత్వం ఢిల్లీలోనే ఉంటుంది. ఢిల్లీ గుమ్మం అనే పదాలు వాడటం ఎంత వరకు సమంజసం?  
ఢిల్లీ గులాములు కాకపోతే హైదరాబాద్‌ విమానాశ్రయానికి తెలంగాణ బిడ్డ పీవీ పేరు పెడదాం అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులను తీర్మానం చేయమనండి. రేపు తెలంగాణకు కర్ణాటకకు, తెలంగాణకు ఏపీకి నీళ్ల విషయంలో పేచీ పడితే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కేంద్రంగా నిర్ణయం జరగాలా? ఢిల్లీ రాజకీయ ఆకాంక్షల మేరకు నిర్ణయం జరగాలా? ప్రజల కోసం పోరాడేది టీఆర్‌ఎస్‌ తప్ప.. ఢిల్లీ వల్ల అవుతుందా?  

టీఆర్‌ఎస్, తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేద్దాం అనుకుంటున్నాం. కానీ కేంద్రం, ప్రధాని మోదీ అడ్డుకుంటున్నారని ఇటీవల చంద్రబాబు అన్నారు కదా?  
మా ప్రాంత రైతుల నోట్లో మట్టి కొట్టాలనుకునే చంద్రబాబుతో కలిసి ఎట్లా పనిచేస్తాం? తెలుగువారు కలిసుండాలి. కానీ, తెలంగాణ ప్రయోజనాలకు భిన్నంగా పనిచేసే వారితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు. చంద్రబాబు 30 ఉత్తరాలను ఉపసంహరించుకుని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెబుతారా?  

టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందనుకున్నానని, అసెంబ్లీ రద్దు ప్రకటన చూసిన తర్వాత టీఆర్‌ఎస్‌ పట్ల వ్యతిరేకత బాగానే కనిపిస్తోందని చంద్రబాబు అన్నారు కదా?  
చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటేనే టీఆర్‌ఎస్‌ మంచిదా? పొత్తు పెట్టుకోకపోవడంతో కాంగ్రెస్‌తో ఆయన పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం చంద్రబాబు, లోకేశ్‌ ఇవే మాటలన్నారు. సైబరాబాద్, హైదరాబాద్‌ నేనే కట్టాను. కులీ కుతుబ్‌షా ఎవరో తెలియదన్నారు.  

హైదరాబాద్‌ నేనే నిర్మించాను. నేను లేని హైదరాబాద్‌ ఊహించలేను అని చంద్రబాబు అన్నారు?  
9 ఏళ్లలో హైదరాబాద్‌ను కట్టిన మహా నాయకుడు చంద్రబాబు.. 4 ఏళ్లలో అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు? ఈ పాటికి అమరావతిని సింగపూర్‌ కంటే గొప్పగా కట్టొచ్చు కదా? ఎందుకు కట్టలేదు?  

టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా వస్తున్న కూటమి మీకు  ఎంత వరకు పోటీనిస్తుంది?  
తెలంగాణకు వ్యతిరేకంగా 67 ఏళ్లు నీళ్లు, కరెంట్‌ ఇవ్వకుండా చావగొట్టిన రెండు పార్టీలు ఒకటిగా రావడం నిజంగా మా నెత్తిన పాలు పోసినట్లే. ఈ పొత్తును స్వాగతిస్తున్నాం. వారు పెట్టుకోకపోతే పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్న.  

తెలంగాణ ఏర్పాటు తర్వాత తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలి? 
నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రైతుబంధు, రైతు బీమా, మిషన్‌ భగీరథ, రైతుకు 24 గంటల ఉచిత కరెంట్‌ లాంటి 453 పథకాలే.. కేసీఆర్‌ మళ్లీ ఎందుకు ముఖ్యమంత్రి కావాలో చెబుతాయి.

కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత మాటల మాంత్రికులు వీళ్లంతా మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా?  
ప్రజలు ఏమైన పిచ్చోళ్లా? ఏ మాట అంటే ఆ మాట చెబితే వింటారా? 58వేల కుటుంబాలకు రైతుబంధు చెక్కులు రాలేదా? 35వేల రైతు కుటుంబాలకు రూ.17 వేల కోట్ల రుణ మాఫీ జరగలేదా? 30లక్షల కుటుంబాలకు రైతు బీమా లేదా? 33 లక్షల మందికి పెన్షన్లు అందడంలేదా? 4 లక్షల మంది బీడీ కార్మికులకు పెన్షన్లు అందడం లేదా? పెన్షన్ల మీదే రూ.5,600 కోట్లు ఖర్చు పెట్టడంలేదా? మేము చెప్పినదాంట్లో ఏది జరగడంలేదు? కాంగ్రెస్‌ నాయకుల ఇళ్లల్లో 24 గంటల కరెంట్‌ రావడంలేదా? నేను చెప్పినదాంట్లో అవాస్తవాలు ఏమున్నాయి?  

ఇప్పటికే ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో 10, 15 మంది అభ్యర్థులపై పునరాలోచన ఉంటుందని అనుకోవచ్చా? 
నాకు తెలిసి సీఎం ఆ ఆలోచనలో లేరు. చాలా స్థిరమైన ఆలోచనతోనే నిర్ణయం తీసుకున్నరు. టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా డబ్బు, మద్యాన్ని పంచుతోందని, ఇప్పటికే నియోజకవర్గ స్థాయికి రూ.25 కోట్లు 
చేరవేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది? ఓటమికి కుంటి సాకులు వెతుక్కోవడం కాంగ్రెస్‌కు అలవాటు. రేపు ఓడిపోయిన తర్వాత ఏదో ఒకటి చెప్పుకోవడానికి జాబితా తయారు చేసుకుంటోంది. 

మద్యం, డబ్బు పంచకుండానే టీఆర్‌ఎస్‌ ఎన్నికలకు వెళ్తుందా? 
ముమ్మాటికీ. అందులో అనుమానం ఎందుకు?  

కొండా సురేఖ మిమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేశారు. ఎందుకు?  
పార్టీ నుంచి బయటకు వెళ్లాలని ఉంటే సహజంగా ఎవరి పైనైనా రాళ్లు వేసి వెళ్తారు. ఆమె ఒక నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆమెకు పార్టీ పునర్జన్మనిచ్చింది. కృతజ్ఞత లేకుంటే ఏమీ చేయలేం. ఇదే కొండా సురేఖను రెండుసార్లు ఓడించింది టీఆర్‌ఎస్‌ కాదా? తాము గొప్ప శక్తులమని ఊహించుకుంటే వారి ఖర్మ.  

ఈ ఎన్నికల తర్వాత జరిగే లోక్‌సభ ఎన్నికల అనంతరం కేటీఆర్‌ సీఎం అయ్యే అవకాశముందా? 
కేసీఆర్‌ ఈ రాష్ట్రానికి ఇంకో పది పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఉండాలని లక్షలాది మంది కార్యకర్తలు, నా కోరిక. ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం. కేంద్రానికి వెళ్లాల్సిన అవసరమేంటి? 

కుటుంబ పాలన అని మీపై కాంగ్రెస్‌ విమర్శలు చేస్తోంది కదా?  
నన్ను సిరిసిల్ల, హరీష్‌ను సిద్దిపేట, కవితను నిజామాబాద్‌ ప్రజలు ఎన్నుకున్నారు. మమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఓడించండి. ప్రజలు వద్దంటే ఇంట్లో కూర్చుంటం. రాహుల్‌గాంధీని అమేధీ ప్రజలు తిరస్కరిస్తున్నరు. అదే మాదిరిగా సిరిసిల్లలో ప్రజలు నన్ను పనికిమాలిన నాయకుడు అనుకుంటే తిరస్కరిస్తరు. ప్రజలకు లేని బాధ మీకెందుకు? 

ప్రధాని మోదీతో మీ పార్టీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని చర్చ జరుగుతోంది?  
ఆ ఖర్మ మాకేం ఉంది? మోదీ వల్ల మాకు, తెలంగాణకు వచ్చిన లాభమేంటి? ఆయన ఈ నాలుగేళ్లలో తెలంగాణకు ఉద్ధరించింది ఏంటి? ఇక్కడ మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్‌. బీజేపీ సోదిలో కూడా లేని పార్టీ.  

టీఆర్‌ఎస్‌ పార్టీ ఏ పార్టీతో కూడా భవిష్యత్తులో పొత్తు పెట్టుకోదా?  
ఏం అవసరం? మజ్లిస్‌ మాకు స్నేహపూర్వక పార్టీ అనేది బహిరంగ రహస్యం.  

కోదండరాం వంటి తెలంగాణ ఉద్యమకారులు రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎందుకు టీఆర్‌ఎస్‌కు దూరమయ్యారు? 
కోదండరాం 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పనిచేశారు. ఎన్నికల్లో విభేదించినవాడు ఎన్నికల తర్వాత కలిసి వస్తే ఏంటి? రాకపోతే ఏంటి? 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావాలనుకున్న వ్యక్తితో మాకేం అవసరం?   

ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. తర్వాత చాలాచోట్ల అసంతృప్తులు, అసమ్మతి ఎందుకు వచ్చింది?  

ఒక పార్టీ 90 శాతం అభ్యర్థులను ఒకేసారి ప్రకటించడం ఒక సాహసం. ఒకటి రెండు చోట్ల తప్ప.. అసంతృప్తి ఎక్కడుంది? ఇదే కాంగ్రెస్‌ చేసి ఉంటే ఇప్పటికే గాంధీభవన్‌ అద్దాలు పగిలిపోయేవి. ధర్నాలు జరిగేవి. అది వాళ్ల కల్చర్‌. తెలంగాణ భవన్‌లో ఏమైనా ధర్నాలు, గొడవలున్నాయా? క్షేత్రస్థాయిలో టికెట్‌ ఆశించిన వారు ఇంకా సమయం ఉందని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. పార్టీకి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరేసినవాళ్లు లేరు. 90 శాతం అభ్యర్థులను ప్రకటించిన తర్వాత కూడా ఈ పాటి అసంతృప్తులు ఉండకపోతే ఎలా? 

ప్రతిపక్షాలన్నీ కలిసి టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నాయి. తెలుగుదేశం, కాంగ్రెస్‌ల పొత్తును ఎలా చూస్తారు? 

చాలా సంతోషంగా స్వాగతిస్తాం. ఈ రోజు తెలంగాణలో ఒకే దెబ్బకి మూడు నాలుగు పిట్టలను కొట్టే అవకాశం ప్రజలకు లభించింది. తెలంగాణ ప్రజలు కొన్ని విషయాలు అంత తొందరగా మరిచిపోరు. పెంచిన కరెంట్‌ చార్జీలను దించాలని అడిగితే 2001లో ఆనాటి టీడీపీ ప్రభుత్వం రైతులను పిట్టల్ని కాల్చినట్లు కాల్చి చంపింది. 2006లో రైతులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ముదిగొండలో కాల్పులు జరిపించింది. రెండు పార్టీలు ఒకటై ముందుకొస్తే ఒకే దెబ్బతో రెండు పార్టీలను ఓడించే అవకాశం ప్రజలకు లభించనుంది. బషీర్‌బాగ్, ముదిగొండ ఓవైపు.. రైతుబంధు మరోవైపు కనబడుతోంది. గతంలో మేమూ పొత్తులు పెట్టుకున్నం. సోనియాగాంధీ దిగి వచ్చి తెలంగాణ ఇస్తామంటే 2004లో కాంగ్రెస్‌తో, 2009లో చంద్రబాబు తెలంగాణకు ఒప్పుకుంటే టీడీపీతో పొత్తు పెట్టుకున్నం. కానీ, ఈ రోజు టీడీపీ, కాంగ్రెస్‌ల పొత్తుకు ప్రాతిపదిక ఏంటి? టీఆర్‌ఎస్‌ను ఓడించడం.. కేసీఆర్‌ను దించడమా? ప్రజల కోణం అవసరం లేదా? ఇదే చంద్రబాబు ఏపీ సీఎంగా కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ప్రాజెక్టులకు అనుమతులివ్వొద్దని 30 ఉత్తరాలు రాశాడు. పొరపాటునో గ్రహపాటునో ఈ కూటమి రేపు అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టులు ఏమవుతాయి? తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష మేరకు కూటమి అంటున్నారు. నీళ్లు ఇవ్వొద్దనా అమరవీరుల ఆకాంక్ష? ఈ ఉత్తరాలు రాసిన చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని రేపు కోదండరాం, కాంగ్రెస్‌ నాయకులు రైతులకు ఏం సమాధానం చెబుతారు? తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రభుత్వాలు రావాలా? తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష. అమరావతిలో చంద్రబాబు పాదాల వద్ద దాసులుగా పడి ఉండే తెలంగాణ నాయకులు కావాలా? ఢిల్లీ గుమ్మం ముందు మోకాళ్ల మీద అడుక్కునే తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు కావాలా? మళ్లీ టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని ఆత్మ గౌరవంతో బతుకుదామా? ప్రజల ముందు ఈ రోజు ఉన్న ప్రశ్న ఇదే. 

తెలంగాణ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌కు ఇసుమంత పాత్ర కూడా లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే. పోరాడింది ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులే అని అని గులాంనబీ ఆజాద్‌ అన్నారు కదా?  
పోయిన ఎన్నికల్లో ఇదే పురాణం. స్వయానా రాహుల్‌గాంధీ వచ్చి తెలంగాణ మేమే ఇచ్చాం అన్నా ఏమైంది? మేము ఇచ్చేవాళ్లం అనే ఫ్యూడల్‌ మనస్తత్వాలు తెలంగాణలో కుదరవు. ఇచ్చేవాళ్లు, తీసుకునేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాటాల ఫలితంగా ఢిల్లీ మెడలు వంచాం. ఇవ్వకపోతే వీపు పగులుతుందని తెలిసి.. ఇవ్వాల్సి వచ్చింది. వాళ్ల మీద వారే పోరాటం చేసినట్లు, షాడో బాక్సింగ్‌ చేసినట్టు డబుల్‌ యాక్షన్లు తెలంగాణలో నడవవు. తెలంగాణను గతంలో ఎవరు లాక్కున్నారు? 1956లో తెలంగాణ, ఏపీకి ఇష్టంలేని పెళ్లి చేసింది జవహర్‌లాల్‌ నెహ్రూ. 1969లో 369 మందిని కాల్చి చంపింది ఇందిరాగాంధీ. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజల అరిగోస పుచ్చుకుంది సోనియాగాంధీ. మీరే సంపుతారు. మళ్లీ మీరే అమరవీరుల çస్తూపం వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తారు. హంతకులే నివాళులు అర్పించడం ఎక్కడి నీతి? ఆజాద్‌ ఎన్ని జాదూ మాటలు చెప్పినా జనం పట్టించుకోరు.

తెలంగాణ ప్రజల కోసం అనేక పోరాటాలు చేశానని, బాబ్లీ కోసం పోరాడకపోతే ఆ ప్రాజెక్టు ఆగేది కాదని, అందుకే ఈ రోజు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అంటున్నారు? 

చంద్రబాబు ఏ అవకాశాన్నీ వదులుకోకుండా రాజకీయాల కోసం వాడుకుంటారు. రెండేళ్లుగా ఆయన కోర్టు ఆజ్ఞలను ధిక్కరిస్తే నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ కాకుండా నాన్‌ వెజ్‌ బిర్యానీ పంపిస్తారా అని సోషల్‌ మీడియాలో జోకులు నడుస్తున్నాయి. నా మీద రైల్వే కోర్టుల్లో కేసులున్నాయి. ఉద్యమంలో మా మీద వందల కేసులు పెట్టారు. మేము కోర్టులకు వెళ్లలేదా? చట్టానికి అతీతుడిని అనుకుంటే ఎలా? తెలంగాణ ఉద్యమ తీవ్రతను తగ్గించడానికి ఆ నాడు బాబ్లీ అంశాన్ని పట్టుకుని ధర్మాబాద్‌ వెళ్లారు. 18 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు బాబ్లీ కేసులో కోర్టుకు వెళ్లేందుకు ఎందుకు ఉత్సాహం చూపుతున్నారు? మిగిలిన 18 కేసుల్లో సైతం స్టేను తొలగింపజేసుకుని విచారణను ఎదుర్కోవాలి. 
 

మరిన్ని వార్తలు