ప్రత్యేక హోదా జగన్‌తోనే సాధ్యం

9 Mar, 2018 09:37 IST|Sakshi

రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేసింది మోదీనే

అందుకు సహకరించింది సీఎం చంద్రబాబే

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి  

పుంగనూరు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డితోనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని, ఇది ప్రజలందరి అభిప్రాయమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం ఆయన పుంగనూరు మున్సిపల్‌ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి 3 వేల కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించిన తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చేసుకుంటున్నాయని తెలిపారు. మోదీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఎన్ని కల్లో రాష్ట్ర ప్రజలను తప్పుడు వాగ్దానాలతో మోసపుచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా ఇవ్వడానికి వీలులేదని చెప్పడం దారుణమన్నారు. రాష్ట్రానికి ప్రధానమంత్రి తీవ్రమైన అన్యాయం చేశారని, అందుకు గొప్పగా సహకరించిన మహానుభావు డు చంద్రబాబునాయుడు విమర్శించారు.

సచివాలయానికి పునాది వేయడానికి ప్రధానమంత్రిని పిలిస్తే ఒక చెంబులో నీరు, ఇంకో చెంబులో మట్టి ఇచ్చి వెళ్లారంటే ఏ మాత్రం రాష్ట్రంపైన ప్రేమాభిమానాలు ఉన్నాయో చెప్పకనే అర్థమవుతుందన్నారు. చంద్రబాబు విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయారన్నారు. ప్రత్యేక హోదా వద్దు, ప్యాకేజీనే ముద్దు అనడంతో పాటు గత బడ్జెట్‌లో ఏ రాష్ట్రానికి ఇంత గొప్పగా చేయలేదని ప్రధానమంత్రికి కితాబు ఇచ్చారని తెలిపారు. మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న చంద్రబాబు ప్రస్తుతం నాలుగైదు రోజుల నుంచి ప్రత్యేక హోదా ఎందుకివ్వరని మాట్లాడం రాజకీయ దురుద్ధేశంతో కూడుకున్నదని విమర్శించారు. ప్రత్యేక హోదాకు ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డికి మైలేజి వస్తోందని, ఇందులో పాల్గొనకపోతే రాజకీయంగా నష్టపోతామనే నీచరాజకీయంతో ఇలా మాట్లాడుతున్నాడంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అర్హుడా ? అన్నది ప్రజలు ఒక్కసారి ఆలోచించాలన్నారు.

ఏదేమైనా ఏప్రిల్‌ ఐదో తేదీదాకా పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతాయని, అప్పటికి కేంద్ర ప్రభుత్వంలో స్పందన లేకపోతే ఆరో తేదీ తమ పార్టీ పార్లమెంట్‌ సభ్యులందరూ రాజీనామా చేస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ పూర్తి స్థాయిలో ప్రత్యేక హోదా కోసం అన్ని విధాలా పోరాడుతోందని తెలిపారు. ఎన్నికలు అయిన తరువాత కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఒత్తిడి చేసి ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకుంటారని ఎమ్మెల్యే చెప్పారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎన్‌ రెడ్డెప్ప, నాగరాజరెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆవుల అమరేంద్ర, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ వెంకటరెడ్డియాదవ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు