అధినేత మదిలో ఏముందో..?!

15 Jan, 2019 08:28 IST|Sakshi

ముంచుకొస్తున్న ముహూర్తం

మంత్రి పదవులపై ఊహాగానాలకు త్వరలో తెర

ఉమ్మడి జిల్లాలో ప్రధానంగా ముగ్గురి పేర్లు

టీఆర్‌ఎస్‌ కీలక నేతలకు పరోక్ష సంకేతాలు

ఈనెల 18న తేలనున్న ‘మంత్రివర్గ విస్తరణ’?

పార్లమెంటరీ కార్యదర్శి, ఇతర పోస్టులపైనా నిర్ణయం

గులాబీ నేతల్లో విస్తృతమవుతున్న చర్చ

మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ముంచుకొస్తోంది. అమాత్య పదవులు ఎవరినీ వరించనున్నాయోనన్న ఊహాగానాలకు త్వరలోనే తెరపడనుంది. ఈనెల 18న మంత్రివర్గ విస్తరణకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరోక్షంగా సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎలాగైనా మంత్రి పదవి దక్కించుకోవాలని కొందరు కొత్తగా ప్రయత్నాలు చేస్తుండగా.. ఈసారి కూడా అనుకున్న శాఖను దక్కించుకోవాలని గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వారు పావులు కదుపుతున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణతోపాటు పార్లమెంటరీ కార్యదర్శి పదవులను కూడా మరోసారి తెలంగాణ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. 2014 ఎన్నికల తర్వాత పార్లమెంటరీ కార్యదర్శి పదవులను తెరపైకి తెచ్చి ఐదుగురికి పదవులు కట్టబెట్టారు. అయితే పార్లమెంటరీ కార్యదర్శి, ఇతర నానినేటెడ్‌ పోస్టుల కోసం పోటాపోటీగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కేటాయింపు కోసం అధినేత మదిలో ఎవరున్నారో..? ఏముందో..? అర్థంగాక ఆందోళన చెందుతున్నారు.  – సాక్షిప్రతినిధి, కరీంనగర్‌

సాక్షి, కరీంనగర్‌ : గతంలో ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిథ్య వహించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కనుందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే మరో మంత్రి పదవి కూడా జిల్లాకు దక్కనుండడంతో ఆ పదవి ఎవరికి దక్కుతుందోననే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో డబుల్‌ హ్యాట్రిక్‌ సాధించిన ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ గతంలో ప్రభుత్వ విప్‌తో సరిపెట్టుకోగా.. ఈ సారి ఎస్సీ సామాజికవర్గం కోటాలో మంత్రి పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నట్లు తెలిసింది.

ఇదే కోవలో హ్యాట్రిక్‌ సాధించిన కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ బీసీ కోటాలో.. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు సైతం జనరల్‌ కోటాలో మంత్రి పదవి కోసం గట్టి పట్టుబట్టుతున్నారు. కేసీఆర్‌కు ఎంతో ఇష్టమైన కరీంనగర్‌ జిల్లా కేంద్రం నుంచి గెలిచిన అభ్యర్థికి మంత్రి పదవి ఇచ్చే ఆలోచన కూడా ఉండడం బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మంత్రి పదవిపై గంగుల గంపెడాశలు పెంచుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి పదవులు ఓకే అయితే పక్కాగా మూడు మంత్రి పదవులు జిల్లాకు దక్కుతాయని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఇద్దరితోపాటు కొత్తగా ఎస్సీ కోటాలో కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి దక్కేందుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

అధినేత కసరత్తు..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రిపదవులపై కసరత్తు చేస్తున్నారు. కులాలవారీగా సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని జాబితా తయారు చేస్తున్నారు. జాబితాలో ఉమ్మడి జిల్లా నుంచి ముగ్గురికి తప్పనిసరిగా చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి. మాజీ మంత్రి కేటీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు కట్టబెట్టడంతో ఆయనకు మంత్రి పదవి ఇవ్వకుండా ఇతరులకు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులైన వొడితెల సతీష్‌బాబుకు ఈసారి కూడా ఆ పదవి దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి పదవులను కేటాయించడంతో అధినేత కేసీఆర్‌ చెప్పిందే వేదం కావడంతో అధినేతను ప్రసన్నం చేసుకునేందకు ఆశావహులు రాజధానిలోనే చక్కర్లు కొడుతున్నారు. అధినేతకు టచ్‌లో ఉంటూ తమకు మంత్రి పదవులు కేటాయించాలని కోరుతున్నారు. అయితే ఈ సారి కొత్తవారిని, పాతవారిని కలుపుకొని మంత్రి పదవులు కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మూడు మంత్రి పదవులకు సామాజిక, జిల్లాల కోణం అడ్డుగా వస్తే రెండు మంత్రి పదవులు ఇచ్చి, స్పీకర్, పార్లమెంటరీ సెక్రటరీ పదవులు ఇస్తారని తెలుస్తోంది. ఇలా జరిగితే ఉమ్మడి జిల్లాను నాలుగు పదవులు వరిస్తాయని తెలుస్తోంది. కేసీఆర్‌ మదిలో ఏముందో..? రెండు రోజుల్లో తేటతెల్లం కానుంది. ఈ సారి విస్తరణలో మొత్తం మిగిలిన 16 మందిని తీసుకుంటారా? లేక ప్రచారం జరుగుతున్నట్లు 6 నుంచి 8 మందిని చేర్చుకుంటారా? అన్న అంశంపై కూడా స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం మందిని తీసుకుంటేనే ఉమ్మడి జిల్లాలో ముగ్గురిని మంత్రి పదవులు వరించనున్నాయన్న ప్రచారం జరుగుతుండగా... అధినేత మనసులో ఏముందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.

మరిన్ని వార్తలు