భలే ప్రజా ప్రతినిధి

23 Mar, 2019 08:28 IST|Sakshi

రాజుశెట్టి ప్రత్యేకత..

ఆయన ప్రచారానికి ఓటర్ల అండదండ..

ఓటుతో పాటు నోటూ ఇస్తున్నారు

ఓటు కోసం నోట్లు పంచడం సాధారణంగా చూస్తుంటాం. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అవసరమైతే మందులు, విందులు ఇస్తుంటారు. కానీ మహారాష్ట్రలోని ఓ లోక్‌సభ నియోజకవర్గంలో మాత్రం వీటికి పూర్తిగా భిన్నమైన దృశ్యాలు కన్పిస్తున్నాయి. అక్కడ లోక్‌సభ అభ్యర్థికి ఓటుతో పాటు నోట్లు కూడా ఇస్తుండడం విశేషం. ఇలాంటి దృశ్యాలు మహారాష్ట్ర కొల్హాపూర్‌ జిల్లా హతకణంగలే లోక్‌సభ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. ‘స్వాభిమాని శేత్కరీ సంఘటన’ నేత ఎంపీ రాజు శెట్టికి ఓటర్లు ఓట్లు వేయడంతోపాటు నోట్లు కూడా ఇచ్చి మీకు అండగా ఉంటామని చెబుతున్నారు. ఇలా రాజు శెట్టికి ఇప్పటి వరకు అనేక మంది ఓటర్లు రూ.1.36 లక్షల నగదు అందించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ ‘నోట్ల మద్దతు’ కోట్లలోకి చేరే అవకాశాలున్నాయి. రైతుల సమస్యలకు కట్టుబడి ఉన్న నేతగా మలినం లేని, ఆరోపణలు లేని నేతగా రాజు శెట్టికి గుర్తింపు ఉంది. ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు మద్దతుగా ఈ నిధి (నగదు) అందిస్తున్నారు. ఆయన ఎన్నికల ప్రచారంలో ఖర్చుతో కూడుకున్న బహిరంగ సభలు ఉండవు. డబ్బుల వృథా ఉండదు. ‘రైతుల సమస్య కోసం నేను పోరాడుతాను. అందుకే నాకు ప్రజలు అండదండలు అందిస్తున్నార’ని రాజు శెట్టి చెబుతున్నారు.

రాజు శెట్టి ఇప్పటి వరకు జిల్లా పరిషత్, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేశారు. ఈ ఎన్నికలలో ‘ఏక్‌ ఓట్‌.. ఏక్‌ నోట్‌’ ఉద్యమానికి పెద్దపీట వేశారు. స్వాభిమాని శేత్కరీ సంఘటన ఉద్యమాల కారణంగా తమకు ఏవైతే లభించాయో వాటిలో పిడికెడన్ని ఆయనకు ఇవ్వాలని రైతులు భావిస్తున్నారు. ఈ విధంగా ఆయనకు ఎన్నికల సమయంలో మద్దతుగా నిధులిచ్చేవారు అత్యంత సామాన్య ప్రజలుంటారు. ఈసారి మద్దతు నిధిని అందించేందుకు పలువురు ముందుకు వచ్చారు. ముఖ్యంగా ఇప్పటి వరకు అందిన వివరాల మేరకు దేవప్పా కాంబ్లే రూ.11 వేలు, సుభాష్‌ ఘోరపడే రూ.15 వేలు అందించారు. ఇంకా షకీల్‌ భగవాన్, వీరేంద్ర మోహితే రూ.5 వేల చొప్పున అందించగా శిరోల్‌ తాలూకా కురుందవాడ్‌ నుంచి డాక్టరు అవినాష్‌ కోగనోల్‌ లోక్‌సభ ఎన్నికల నిధిగా ఏకంగా లక్ష రూపాయలు అందించారు. ఇలా వచ్చిన నిధులను ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులపై ఖర్చు చేయడంతోపాటు మిగిలిన నిధులను స్వాభిమాని శేత్కరీ సంఘటన కార్యకలాపాల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా ఓటర్లు ఇచ్చిన పైసా పైసాకు రాజు శెట్టి లెక్కలు చూపుతారు. దుబారా ఖర్చు అసలు ఉండకుండా జాగ్రత్త పడతారు. ఇలా ఓటర్ల చందాలతో ఎన్నికయ్యే రాజు శెట్టి గురించి అనేక మంది ప్రశంసలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలే మరణించిన గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పరీకర్, మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం రాజు శెట్టిని అభినందించిన వారిలో ఉన్నారు.– గుండారపు శ్రీనివాస్, సాక్షి– ముంబై

రాజు శెట్టికి ఎన్నికల్లో ఓటర్ల ద్వారా అందిన నిధులు
2009:    రూ.44 లక్షలు
2014:    రూ.64 లక్షలు
2019:     రూ.1.36 లక్షలు (ఇప్పటి వరకు)

మరిన్ని వార్తలు