ప్రజా విజయ పతాక ఎగిరిన రోజు

23 May, 2020 04:56 IST|Sakshi

నవ శకానికి నాంది పలికిన శుభ ఘడియ.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖించిన రోజు... విలువలు, విశ్వసనీయతకు ప్రజలు పట్టం కట్టిన రోజు... మూకుమ్మడి కుట్రలను ప్రజలు నిర్ద్వందంగా తిప్పికొట్టిన రోజు... ప్రజా కంటక పాలనకు ముగింపు పలికిన రోజు... తిరుగులేని ప్రజాబలంతో వైఎస్సార్‌ సీపీ అఖండ విజయం సాధించిన రోజు... 151 అసెంబ్లీ సీట్లు, 22 ఎంపీ సీట్లు గెలుచుకుని  50 శాతం ఓట్లతో విజయ దుందుభి మోగించిన రోజు.. 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లతో  రాజకీయ రికార్డులు సృష్టించిన రోజు... ‘కావాలి జగన్‌...రావాలి జగన్‌’  జన నినాదం నిజమైన రోజు... 

సాక్షి, అమరావతి: రాజకీయాల్లో సరికొత్త చరిత్ర లిఖిస్తూ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అఖండ విజయం సాధించి నేటికి సరిగ్గా ఏడాది అవుతోంది. 2019 మే 11వతేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ జరగగా మే 23న ఫలితాలు వెలువడ్డాయి. ఈవీఎంలు తెరిచి ఓట్ల లెక్కింపు మొదలైన కొన్ని క్షణాల్లోనే వైఎస్సార్‌ సీపీ విజయ దుందుభి ఖాయమన్నది స్పష్టమైపోయింది. రౌండ్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ మెజార్టీ ఎంత అనే ప్రశ్న మినహా విజయంపై ఎవరికీ సందేహాలు లేవు. అప్రతిహతంగా సాగిన విజయప్రస్థానం  ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యేసరికి వైఎస్సార్‌సీపీ ఏకంగా 151 అసెంబ్లీ నియోజక వర్గాలు, 22 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నెగ్గి అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన 2019 ఎన్నికల్లో 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లను సాధించి  తిరుగులేని ప్రజాబలంతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజేతగా నిలిచారు. నేటికి ఏడాది అవుతున్నా ఆనాటి విజయం ఇప్పటికీ ప్రజల కళ్లముందు కదలాడుతూ మధురానుభూతి కలిగిస్తోంది.   

రాష్ట్ర చరిత్రలో ఓ పార్టీ అతిపెద్ద విజయం 
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలో వైఎస్సార్‌ సీపీ ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలోనే అతిపెద్ద విజయాన్ని సాధించి రికార్డులు తిరగరాసింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకంగా 151 స్థానాల్లో విజయదుందుభి మోగించింది. 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో 22 చోట్ల విజయ కేతనం ఎగురవేసింది. 2019 ఎన్నికల్లో మొత్తం 50 శాతం ఓట్లు, 86 శాతం అసెంబ్లీ సీట్లు, 92 శాతం ఎంపీ సీట్లతో వైఎస్సార్‌సీపీ సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్ర చరిత్రలో ఈ స్థాయిలో ఓట్లు, సీట్లు  మరే పార్టీ సాధించలేదు. అంతకుముందు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన 1972 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌–సీపీఐ కూటమి, 1994 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ–వామపక్షాల కూటమి భారీ విజయాలు సాధించాయి. 1971లో బంగ్లాదేశ్‌తో యుద్ధంలో విజయం సాధించిన అనంతరం ఇందిరాగాంధీ ప్రభంజనంలో జరిగిన ఎన్నికలు కాంగ్రెస్‌–సీపీఐ కూటమికి ఘన విజయం చేకూర్చాయి. అయితే కాంగ్రెస్‌కు ఆ ఎన్నికల్లో ప్రతిపక్షమే లేదు.

ఆ కారణంగా ఇండిపెండెంట్లు రెండో స్థానంలో నిలవడంతో అవి ఏకపక్ష ఎన్నికలని అర్థమవుతోంది. ఇక 1994 ఎన్నికల్లో టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకుని పోటీ చేశారు. అప్పటికి వామపక్షాలకు రాష్ట్రంలో ఎంతో కొంత బలం ఉంది. ఆ ఎన్నికల్లో టీడీపీకీ 44 శాతం, సీపీఐకి 3.39 శాతం, సీపీఎంకు 2.96 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఒంటరిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌ సీపీ 2019 ఎన్నికల్లో అధికార టీడీపీ కుట్రలు, ఎల్లో మీడియా విష ప్రచారాన్ని ఎదుర్కొని ఏకంగా 50 శాతం ఓట్లతో ఘన విజయం సాధించి రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు, ప్రకాశం–నెల్లూరు, రాయలసీమ... అన్ని ప్రాంతాల్లోనూ ప్రజలు వైఎస్‌ జగన్‌కు అఖండ మెజార్టీ చేకూర్చారు.  

కుట్రలు పటాపంచలు
ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో సీఎం అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా ఒంటరిగా పోటీ చేయని చంద్రబాబు 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చేందుకు తెరచాటు ఎత్తులు వేశారు. అందులో భాగంగానే జనసేన విడిగా పోటీ చేసింది. ఆ పార్టీ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీతో పొత్తు పెట్టుకునేలా చంద్రబాబు తెరచాటు మంత్రాంగం నడిపారు. జనసేన పొత్తులో భాగంగా ఏ సీట్లు సీపీఎం, సీపీఐ, బీఎస్పీలకు కేటాయించాలో కూడా టీడీపీ ప్రధాన కార్యాలయంలోనే నిర్ణయించారు. లోకేశ్‌ పోటీ చేసిన మంగళగిరిలో జనసేన బరిలో దిగకపోవడమే ఇందుకు  మచ్చు తునక. పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల తరపున చంద్రబాబు ప్రచారం కూడా చేయలేదు. చంద్రబాబు, లోకేశ్‌ పోటీ చేసిన కుప్పం, మంగళగిరిలలో తమ మిత్రపక్షాల తరపున పవన్‌ కల్యాణ్‌ ప్రచారం చేయలేదు. ఇక చంద్రబాబు జాతీయ స్థాయిలో రాహుల్‌గాంధీతో బహిరంగంగానే అవగాహన కుదుర్చుకుని ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేలా కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో పోటీ చేసేలా చూశారు. చంద్రబాబు అనుకూల మీడియా అయితే వైఎస్‌ జగన్, వైఎస్సార్‌సీపీపై అసత్యాలు, అభూత కల్పనలతో పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసింది. అంతా మూకుమ్మడిగా పన్నిన కుట్రలను వైఎస్‌ జగన్‌ ఒక్కరే ఒంటిచేత్తో ఎదుర్కొన్న తీరు జాతీయ స్థాయిలో అందరినీ ఆకర్షించింది.    

చావు దెబ్బతిన్న టీడీపీ 
2019 ఎన్నికల్లో టీడీపీ చావు దెబ్బతింది. 36 ఏళ్ల ఆ పార్టీ చరిత్రలో చంద్రబాబు సారథ్యంలో ఘోర ఓటమిని చవి చూసింది. 175 నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం 23 సీట్లలోనే నెగ్గింది. లోకేశ్‌తో సహా చంద్రబాబు మంత్రివర్గంలోని 19 మంది మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లు ఘోర పరాజయం చెందారు. నాలుగు జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఇక తొలిసారి పోటీ చేసిన జనసేన కేవలం ఒక్క స్థానంలో విజయం సాధించింది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లోనూ పరాజయం పాలయ్యారు. జాతీయ పార్టీలు పత్తా లేకుండాపోయాయి. వైఎస్సార్‌సీపీకి అఖండ విజయాన్ని అందించిన 2019 ఎన్నికలు 70 ఏళ్ల రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సరికొత్త చరిత్రను సృష్టించాయనడంలో సందేహం లేదు.  

విశ్వసనీయత... విలువలకు పట్టం 
వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌ సీపీకి ప్రజలు అఖండ విజయం చేకూర్చటానికి ప్రధాన కారణం విలువలు, విశ్వసనీయతే. 2011లో పార్టీని స్థాపించినప్పటి నుంచి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వైఎస్‌ జగన్‌ తన విశ్వసనీయతను కోల్పోలేదు. విలువలపై రాజీ పడలేదు. 2014 ఎన్నికల్లో తృటిలో అధికారం చేజారినా సరే విలువలతో కూడిన రాజకీయాలకే కట్టుబడ్డారు. వైఎస్సార్‌ సీపీ నుంచి గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నా, వారిలో నలుగురిని మంత్రులను చేసినా దృఢంగా చంద్రబాబు ప్రజా కంటక పాలనపై అలుపెరగని పోరాటం చేశారు.   

పాదయాత్రతో భరోసా 
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో 341 రోజుల పాటు 3,648 కి.మీ. మేర నిర్వహించిన ‘ప్రజాసంకల్ప యాత్ర’ ద్వారా కష్టాల్లో ఉన్నవారికి ‘నేను విన్నాను... నేను ఉన్నాను’ అని భరోసా కల్పించారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా నవరత్నాల పథకాలతో 2019 ఉగాది రోజు విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా తాను అందించనున్న సువర్ణ పాలనను వివరించారు. అందుకే యావత్‌ రాష్ట్ర ప్రజానీకం ‘రావాలి జగన్‌... కావాలి జగన్‌’ అని ముక్తకంఠంతో నినదిస్తూ అద్భుత విజయాన్ని అందించింది.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా