‘గాంధీ’లకు ఎస్పీజీ భద్రత తొలగింపు

9 Nov, 2019 04:02 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు ఉన్న స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూపు(ఎస్పీజీ) కేంద్రం ఉపసంహరించింది. ఎస్పీజీ నుంచి సీఆర్‌పీఎఫ్‌ బలగాల సంరక్షణలోని జడ్‌ ప్లస్‌ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. దాదాపు 28 ఏళ్ల తర్వాత గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను కేంద్రం తగ్గించడం గమనార్హం. 1991లో ఎల్‌టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు అధికారులు స్పష్టంచేశారు. దీంతో ఎస్పీజీలోని సుమారు  3 వేల మంది సైనికులు కేవలం ప్రధానికే భద్రత కల్పించనున్నారు. ఈ పరిణామంపై కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. బీజేపీ వ్యక్తిగతంగా టార్గెట్‌ చేసే స్థాయికి దిగజారిందంటూ అహ్మద్‌ పటేల్‌ వ్యాఖ్యానించారు. కేంద్రం కక్ష సాధింపునకు పాల్పడుతోందని ఆనంద్‌ శర్మ అన్నారు.

మరిన్ని వార్తలు