‘చంద్రబాబుది సైంధవ పాత్ర’

7 Jul, 2020 11:31 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇళ్లపట్టాల పంపిణీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుది సైంధవ పాత్ర అని ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథ రాజు విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..  పేద ప్రజల ఇళ్ల పట్టాలు పంపిణీని టీడీపీ అడ్డుకుంటోందని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల కోసం 60 వేల ఎకరాలు సిద్దం చేశామని తెలిపారు. మొత్తం 30 లక్షల మంది పేద కుటుంబాలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారన్నారు. దేవతలు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసే ప్రయత్నం చేస్తారన్న పద్దతిలో చంద్రబాబు, ఆయన మనుషులు ఈ కార్యక్రమాన్ని పదేపదే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అయినా వారి ఆటలు సాగవని,  వారు చరిత్ర హీనులు కాక తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు కలిపి 60వేల ఎకరాల సేకరణ ద్వారా అడుగు ముందుకు వేశామని తెలిపారు. ఇళ్ల స్థలాలు రెడీగా ఉన్నాయని, ఇవ్వటానికి ప్రభుత్వం కూడా సిద్దంగా ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు, ఆయన అనుయాయులు ఈ ప్రక్రియను అడ్డుకునేందుకు హైకోర్టుకు వెళ్లారని, కొన్ని వందల రిట్‌ పిటిషన్లు దాఖలు చేయించారని చెప్పారు. (కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో నాణ్యమైన సేవలు)

అందులో ప్రధానంగా నాలుగు రిట్‌ పిటీషన్‌లకు సంబంధించి హైకోర్టు మధ్యంతర ఆదేశాలు జారీ చేసిందని, వాటి ప్రకారం ఇళ్ల పట్టాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ చేసేందుకు, రిజిస్ట్రేషన్‌ పట్టాలిచ్చేందుకు వీలుకాని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. దీనిని తాము సుప్రీం కోర్టులో సవాల్‌ చేశామని, కోవిడ్‌ సమయంలో సుప్రీంకోర్టుకు కూడా సెలవులు ఉన్నందున ఇప్పటికిప్పుడు ఆ స్టేలను తొలగించే పరిస్థితి లేదన్నారు. కాబట్టి స్థలాల పంపిణీకి కొద్ది సమయం పడుతుందని ఆయన చెప్పారు. ఈ అవరోధాలన్నీ తొలగి ఆగస్టు 15 నాటికి ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్‌ చేసి అక్కచెల్లెమ్మల చేతుల్లో ఈ 30 లక్షల ఇళ్ల పట్టాలను కెటాయించిన స్థలంలోనే వారికి అందజేస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంలో ఒక వజ్ర సంకల్పం ఉందన్నారు. అదే సమయంలో మరొక ముఖ్యమైన విషయాన్ని కూడా అందరూ గమనించాలన్నారు. దీనికి అడ్డుపడుతున్నది ఎవరు..? ఎందుకు కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది..? పేదలకు ఇళ్ళ స్థలాలు ఇవ్వటానికి చంద్రబాబు ఎందుకు అడ్డుపడుతున్నాడో ప్రతి ఒక్కరూ గమనించాలన్నారు. 

తన హయాంలో 2 లక్షల ఇళ్లు కూడా కట్టించలేకపోయానన్న అవమానంతోనే బాబు ఇలా చేస్తున్నారా లేదా తమ ప్రభుత్వం 30 లక్షల ఇళ్ల పట్టాలు ఒకేసారి ఇస్తే.. ఇక తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదన్న భయంతో బాబు అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు తన హయాంలో లక్షల ఇళ్లు కట్టేశానంటూ విచిత్ర వాదన చేశారని, ఎక్కడ కట్టారో ఆయనకే తెలియాలన్నారు. చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో మొదటి రెండేళ్లు ఇళ్ల నిర్మాణం ఆపేశారన్నారు. ఆ తర్వాత మూడేళ్లలో 2 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది లేదని పేర్కొన్నారు. అంతేగాక టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు కానీ, పునాది పడక ముందే.. మీ ఫ్లాట్‌ ఫలానా చోట ఉంటుందంటూ.. నేల మీద నిలబెట్టి గృహప్రవేశాలు చేయించేశారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు కట్టిన ఇళ్లు ఎక్కడున్నాయో ఎవరికీ తెలియదు కానీ ఆయన పెట్టిన టిడ్కో బకాయిలు మాత్రం వేలల్లో ఉన్నాయిన విమర్శించారు. 3 వేల కోట్ల రుపాయలు హౌసింగ్‌కు సంబంధించి ఇతర బకాయిలు మరో 1300 కోట్ల రూపాయలు కలిసి మొత్తం 4,300 కోట్ల రూపాయలు బాకీ పెట్టి దిగిపోయారని విమర్శించారు. ఇవన్నీ నిజాలు కాదా..?  ఈ డబ్బు అంతా ఎవరు కట్టాలి.. చంద్రబాబు ఎందుకు కట్టలేదని మంత్రి ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా